హెచ్ఎండీఏ కీలక అధికారిగా (మాజీ డైరెక్టర్) వ్యవహరించిన శివబాలక్రిష్ణ ఇంటి మీద ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించటం భారీ ఎత్తున ఆస్తుల్ని గుర్తించటం తెలిసిందే. ఆయన అవినీతి మీద కొత్త ఆరోపణలు వస్తున్న వేళ.. ఆయన వద్ద గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో వందల కోట్లు కావటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి భారీ ట్విస్టు తెర మీదకు వచ్చింది.
శివ బాలక్రిష్ణ వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లుగా.. కీలక అధికారుల పాత్ర సైతం ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం తెలిసిందే. అయితే.. వీటికి సంబంధించిన కీలక ఆధారాలు మొన్నటివరకు లభించింది లేదు. అయితే.. తాజాగా మాత్రం శివ బాలక్రిష్ణ అక్రమాస్తుల అంశంలో ఆయన సోదరుడుతో పాటు.. ఏసీబీ అధికారుల విచారణలో శివబాలక్రిష్ణ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు.
తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగినట్లుగా భావిస్తున్నారు. శివబాలక్రిష్ణ అవినీతి కేసులో తాజాగా సిద్ధం చేసిన ఏసీబీ నివేదికలో నాటి హెచ్ఎండీ బాస్ అయిన అరవింద్ కుమార్ ప్రస్తావన తెచ్చినట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే ఈ ఉదంతంలో ఇదో సంచలనంగా మారుతుందని చెప్పాలి. ఏసీబీ నివేదికలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ ను విచారించేందుకు వీలుగా ప్రభుత్వాన్ని ఏసీబీ అధికారులు అనుమతి కోరినట్లుగా తెలుస్తోంది.
అదే నిజమైతే.. అరవింద్ కుమార్ విచారణకు వస్తే మరిన్ని సంచలనాలు చోటు చేసుకోవటం ఖాయమంటున్నారు. అంతేకాదు బాలక్రిష్ణ నుంచి రికవరీ చేసిన ఫోన్లు.. ల్యాప్ టాప్ లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పదేళ్ల కాలంలో 15 సెల్ ఫోన్లు మార్చినట్లుగా గుర్తించారు. వాటిని సైతం రికవరీ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ ప్రస్తావన రావటం ద్వారా ఈ కేసు మరో మలుపు తిరిగినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చుడే ఆలస్యంగా అన్నట్లు ఉన్న ఏసీబీ అధికారులు అంతిమంగా ఏం బయటకు తీస్తారన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.