కన్నడ కథానాయకుడు దర్శన్.. తన అభిమానే అయిన రేణుక స్వామి అనే వ్యక్తిని తన బృందంతో కలిసి దారుణంగా హింసించి హత్య చేయించిన విషయం కొన్ని నెలల కిందట ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. కారణాలు ఏవైనా కానీ.. రేణుకస్వామిని దర్శన్ అండ్ కో హింసించిన తీరు ఘోరాతి ఘోరం. తన గాయాలు, అనుభవించిన చిత్రహింస గురించి మీడియాలో రాయలేనంత ఘోరం జరిగింది. ఈ హత్యలో దర్శన్ స్వయంగా పాల్గొన్నట్లు ఆధారాలు ఉండడంతో అతను జైలు పాలయ్యాడు. ఈ కేసులో దర్శన్‌తో పాటు అతను ఎవరి కోసం అయితే రేణుక స్వామిని హత్య చేశాడో, ఆ పవిత్ర గౌడ.. మరో 13 మందిని నిందితులుగా చేర్చి రిమాండుకు తరలించాడు పోలీసులు. తాజాగా ఈ కేసులో ఛార్జ్ షీట్ వేశారు పోలీసులు.
ఇందులో హత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి వివరిస్తూ.. రేణుకస్వామి విపరీత ప్రవర్తన గురించి పోలీసులు పేర్కొన్నారు. మారు అకౌంట్లతో రేణుకస్వామి.. పవిత్రకు దారుణమైన మెసేజ్‌లు పంపించినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లయి భార్య ఉన్న దర్శన్‌తో పవిత్ర సహజీవనం చేయడం ఇష్టం లేకనే ఆమెకు అసభ్య సందేశాలు పంపాడని ఇంతకుముందే వెల్లడైన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా తాను నెలకు 10 వేల రూపాయలు ఇస్తానని.. తనతోనూ సహజీవనం చేయాలని రేణుకస్వామి.. పవిత్రకు మెసేజ్‌లు పెట్టాడట. తన ఫ్రెండు పేరుతో అతను మరిన్ని అసభ్య సందేశాలు కూడా పంపాడట. పవిత్ర వార్నింగ్ ఇచ్చినా వినకుండా ఇలాంటి మెసేజ్‌లే పెట్టి వేధిస్తుండడంతో ఆమె దర్శన్‌కు ఇవన్నీ చూపించడం.. అతను కోపోద్రిక్తుడై తన అనుచరులతో కలిసి రేణుకస్వామికి బుద్ధి చెప్పాలనుకోవడం.. ఈ క్రమంలో అతను హత్యకు గురి కావడం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.