హైదరాబాద్ లో అప్సర హత్య కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆలయ పూజారి సాయికృష్ణ…. అప్సరను దారుణంగా హతమార్చిన వైనం పెను దుమారం రేపింది. ఈ క్రమంలోనే సాయికృష్ణపై అప్సర తండ్రి శ్రీకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన కూతురిపై సాయికృష్ణ కుటుంబ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారని, దేవుడే తమకు న్యాయం చేయాలని వాపోయారు. తన కూతురిని నమ్మించి సాయి కృష్ణ గొంతు కోశాడని ఆరోపించారు. గుడికి వెళ్ళిన తన కుమార్తెను సాయి కృష్ణ ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపించారు.
భార్యతో గొడవలున్నాయని, ఆమెకు విడాకులిచ్చి ఆరు నెలల్లో పెళ్లి చేసుకుంటానని అప్సరకు మాయమాటలు చెప్పాడని ఆరోపించారు. పెళ్లి చేసుకోమని పట్టుబట్టంతోనే చివరకు తన కూతురిని చంపేశాడని ఆరోపించారు. మరోవైపు, ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కార్తీక్ తో వివాహం అయిందని, ఆమె వేధింపులు తాళలేకే కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని కార్తీక్ తల్లి ధనలక్ష్మి మాట్లాడిన ఆడియో టేప్ ఇప్పుడు వైరల్ గా మారింది. లగ్జరీగా బతికేందుకు, ఎంజాయ్మెంట్ కోసం టూర్లకు తీసుకువెళ్లాలని కార్తీక్ ను అప్సర ఒత్తిడి చేసేదని టార్చర్ పెట్టేదని ధనలక్ష్మి ఆరోపించారు.
చివరకు కేసు కూడా పెట్టిందని, దాంతో, కార్తీక్ ని అరెస్ట్ చేసి పోలీసులు జైల్లో కూడా పెట్టారని ఆరోపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్తీక్ కృంగిపోయాడని, ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. తన కొడుకు చావుకు అప్సర, ఆమె తల్లి కారణమని ఆరోపించారు. తన కొడుకు చనిపోయిన తర్వాత అప్సర, ఆమె తల్లి కనిపించడం లేదని, చివరకు హైదరాబాద్ లో ఉన్నట్టుగా ఈ హత్య వార్త ద్వారా తెలుసుకున్నానని అన్నారు. అప్సరకు సినిమాలలో నటించాలని కోరిక ఉండేదని, అందుకే వారు హైదరాబాద్ కు వచ్చారని ధనలక్ష్మి అన్నారు.