ఏపీలోనూ ప్రధాని మోడీ విజృంభిస్తే.. ఈ మాటే వైసీపీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కర్ణాటక ఎన్నికలను పరిశీలిస్తే.. అక్కడ మునుపెన్నడూ లేని విధంగా ప్రధాని మోడీ విజృం భిస్తున్నారు. ప్రజలను తన మాటలతో ఆకర్షిస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విరుచుకుపడుతు న్నారు. ముఖ్యంగా హిందూ ఓట్లను ఆకట్టుకునే క్రమంలో పాతవి తవ్వుతున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించలేక పోయారంటూ.. వాదన తెరమీదికి తెచ్చారు.
దీంతో కాంగ్రెస్ అక్కడ అల్లాడి పోతోంది. ఎక్కడా ఏమీ చెప్పుకోలేక పోయే పరిస్థితి వచ్చింది. ఇక, ఇప్పుడు ఇదే దూకుడు ఏపీలోనూ మోడీ అండ్ కో ప్రదర్శిస్తే.. ఏం జరుగుతుంది? ఏపీలోనూ హిందువుల ఓట్లే కీలకం. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా హిందువుల ఓట్లకు ప్రాధాన్యం ఉంది. ప్రధానంగా మెజారిటీ నియోజక వర్గాల్లో వారిదే పై చేయిగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ ప్రధాని మోడీ వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తే.. ఏం జరుగుతుందనేది వైసీపీ నేతల మధ్య చర్చకు వస్తోంది.
ఇతర విషయాలను ప్రస్తావించకపోయినా.. దేవాలయాలపైదాడులు.. అంతర్వేది రథం దగ్ధం.. విజయన గరం జిల్లాలోని రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదం వంటివాటిని ప్రస్తావిస్తే.. వైసీపీ డిఫెన్స్‌లో పడడం ఖాయం. ఆయా ఘటనలపై కేసులు నమోదు చేశారు కానీ.. ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేక పోయారు. కనీసం ఈ కేసుల్లో పురోగతి కూడా లేదు. ఈ పరిణామాలు ఇప్పుడు సమసిపోయినట్టు కనిపిస్తున్నాయి.
కానీ, ఎన్నికలనాటికి బీజేపీ ఇక్కడ పుంజుకుని.. ఒంటరిపోరుకు సిద్ధమైతే..(ఎందుకంటే పొత్తులపై ఏమీ తేల్చడం లేదు. ఒంటరి పోరేనని రాష్ట్ర నేతలు కూడా చెబుతున్నారు) ఖచ్చితంగా హిందువుల ఓట్లకు.. బీజేపీ గేలం వేయడం ఖాయం. ఆ పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటే.. పాత విషయాలను ఖచ్చితంగా కమల నాథులు తవ్వుతారు. దీంతో వైసీపీ డిఫెన్స్‌లో పడడం ఖాయమని అంటున్నారు వైసీపీ నాయకులు. మరి ఏం చేస్తారోచూడాలి.