సినిమాను బతికించుకునేందుకు ఏం చేయాలన్న దానిపై కొద్ది రోజులుగా వివిధ విభాగాలతో చర్చలు జరుపుతున్న టాలీవుడ్ నిర్మాతలు కొత్త మార్గదర్శకాల్ని సిద్ధం చేశారు. హీరో.. హీరోయిన్ రెమ్యునరేషన్ నుంచి రోజువారీ ఖర్చుల వరకు అన్ని అంశాల్ని చర్చించిన వైనం తాజాగా విడుదల చేసిన ప్రకటన చెప్పేస్తుంది. పలు అంశాల మీద లోతైన చర్చ అనంతరం తాము కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లుగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెబుతోంది. హీరో మొదలుకొని బాయ్ వరకు ఖర్చులకు సంబంధించిన అంశాలతో పాటు.. ఓటీటీకి ఎప్పుడు ఇవ్వాలి? టికెట్ ధరలు ఇలాంటి అంశాలెన్నో అందులో ఉన్నాయి.
తాజా మార్గదర్శకాలు ఈ నెల (సెప్టెంబరు) 10 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. ఇంతకాలం రోజువారీ వేతనంగా ఉండే చెల్లింపులకు చెక్ పెట్టనున్నారు. అంతేకాదు.. హీరో.. హీరోయిన్లకు పారితోషికం.. వారి సిబ్బందికి వేరుగా సౌకర్యాల మోతను దించుకునేందుకు వీలుగా నిర్ణయాల్ని తీసుకున్నారు. అవేమంటే…
– హీరోలు.. హీరోయిన్లకు సంబంధించిన రెమ్యునరేషన్ మొత్తం కలిపి ఇస్తారు. వారి వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన ఖర్చుల్ని నటులే చూసుకోవాలి. వారికి అవసరమైన రవాణా.. బస.. ప్రత్యేక ఆహారం లాంటివన్నీ కలుపుకొనే రెమ్యునరేషన్ ఉంటుంది. ఎవరికి ఎంత రెమ్యునరేషన్ అన్నది ఆయా పాత్రలు.. సినిమాలకు అనుగుణంగా నిర్మాతే డిసైడ్ చేస్తారు.
– సినిమా మొత్తానికి ఏక మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తారు. ఈ మధ్యన రోజువారీ వేతనంగా ఇవ్వటం మొదలైంది. దాన్ని ఇకపై అమలు చేయరు. ఒప్పందంలో భాగంగా ఎంత మొత్తం అనుకుంటారో అంతే మొత్తాన్ని నటులకు రెమ్యునరేషన్ గా ఇవ్వాలి. వేరుగా నగదు ఇవ్వకూడదు. టెక్నిషియన్స్ విషయంలోనూ ఇదే పద్దతిని అమలు చేస్తారు.
– సినిమా షూటింగ్ కు ముందే చెల్లింపులు.. రెమ్యునరేషన్ కు సంబంధించిన అన్ని అగ్రిమెంట్లు పూర్తి చేసుకోవాలి. వాటిని తప్పనిసరిగా ఛాంబర్ లో ఖరారు చేయాలి.
– నటులు మాత్రమే కాదు సాంకేతిక నిపుణుల వరకు ఎవరికి కూడా రోజువారీ చెల్లింపులు జరపరు.
– స్క్రిప్టు అప్ డేట్స్.. కాల్ షీట్లు తదితర వివరాల్ని ప్రతిరోజూ నోట్ చేయాలి.
– ఆర్టిస్టుల కాల్ షీట్ల విషయంలోనూ.. టైమింగ్ విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తారు.
– థియేటర్ లో విడుదలైన సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలి
– ఓటీటీ.. శాటిలైట్ హక్కులు ఏ సంస్థ దక్కించుకున్నాయో వాటి వివరాలు సినిమా టైటిల్స్ లో కానీ.. ప్రచారంలోకానీ బహిర్గతం చేయకూడదు.
– వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) అంశంపై చర్చలు సాగుతున్నాయి. ఈ నెల ఆరున మరోసారి భేటీ అవుతారు. తెలంగాణలో మాదిరే ఆంధ్రప్రదేశ్ లోని మల్టీఫ్లెక్సులకు వీపీఎఫ్ అందనుంది.