వైఎస్సార్ కళ్యాణమస్తు పథకాన్ని సీఎం జగన్ గొప్పగా ప్రవేశపెట్టారని వైసీపీ నేతలు మరింత గొప్పగా ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం కంటే తాము ఇంకా ఎక్కువ నగదు ఇస్తున్నామని కూడా వారు ప్రగల్భాలు పలికారు. ఎస్సీలకు లక్ష రూపాయలు, ఎస్సీల కులాంతర వివాహాలకు లక్షా 20 వేల రూపాయలు, బీసీలకు 50వేలు, బీసీలో కులాంతర వివాహాలకు 75 వేల రూపాయలు, మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయలు, దివ్యాంగులు వివాహాలకు లక్షన్నర, భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు 40 వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం కూడా చేశారు జగన్. ఇదంతా 2019 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో జగన్ ఇచ్చిన హామీ.
కట్ చేస్తే, జగన్ సీఎం అయిన తర్వాత ఆ పథకం అటకెక్కింది. జగనన్న సీఎం అయిన తర్వాత ఏ చెల్లికి, తమ్ముడికి కూడా వాటి తాలూకు డబ్బులు రాలేదు. దరఖాస్తులైతే పెట్టించుకుంటున్నారుగానీ…ఒక్క రూపాయి కూడా ఖాతాలలో పడిన పాపాన పోలేదు. 2019లో ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్నవారికి ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా ఆ డబ్బులు రాలేదు. అదేమంటే, మా దగ్గర డబ్బుల్లేవు…అంటూ ఉత్త చేతులు చూపించింది జగన్ సర్కార్. దీంతో, జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
దీంతో, తాజాగా ఆ పథకానికి కొన్ని అడ్డగోలు నిబంధనలు విధించి మరోసారి జనం ముందుకు రాబోతోంది జగన్ సర్కార్. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే కచ్చితంగా పదో తరగతి పాసవ్వాల్సిందేనంటూ మెలిక పెట్టారు జగన్. ఇక, అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలుండాలి అంటూ మరో నిబంధన విధించారు. గ్రామాల్లో అబ్బాయికి ఆదాయం 10 వేలకు మించకూడదు, పట్టణాల్లో అయితే 12 వేలకు మించకూడదు. ఇక, నెలవారీ విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటకూడదు. ఇక, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, పన్ను చెల్లింపుదారులు ఉండకూడదు.
గ్రామ సచివాలయాల ద్వారా ఈ పథకం అమలు చేయబోతున్న ఈ కొత్త నిబంధనలతో కూడిన పథకంపై విమర్శలు వస్తున్నాయి. ఇలా అడ్డగోలు నిబంధనలు పెట్టే బదులు..అసలు పథకం ఎత్తేస్తే పోతుంది కదా అని జనం విమర్శిస్తున్నారు. టీడీపీ హయాంలో ఇలాంటి చెత్త నిబంధనలు లేవని, జగన్ వచ్చిన తర్వాతే ఇలా రూల్స్ అంటూ ఏరివేత ప్రారంభించారని మండిపడుతున్నారు.