ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతుండడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన నిబంధనలను టీటీడీ సడలిస్తోన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఆన్ లైన్ టికెట్లలోనే బుకింగ్ ను అనుమతించిన టీటీడీ…రెండ్రోజులుగా ఆఫ్ లైన్ లోనూ టికెట్లు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సమావేశమైన టీటీడీ పాలకమండలి…పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇకపై, స్వామి వారిని దర్శించుకునే భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందించాలని నిర్ణయించింది.ఇకపై తిరుమలలో సీఎం జగన్ మొదలు సామాన్య జనం వరకు అందరికీ ఒకే రకమైన భోజనం అందించాలని నిర్ణయించింది. అందుకోసం తిరుమలలో ప్రైవేటు హోటళ్లను తొలగించి భక్తులందరికీ అన్ని ప్రదేశాల్లో శ్రీవారి అన్నప్రసాదం అందించాలని నిర్ణయించింది.
చాలాకాలం తర్వాత ఆర్జిత సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై రెండు రోజుల్లో ప్రకటన చేస్తామన్నారు.టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలు
- సుప్రభాత సేవకు రూ.2 వేలు
- తోమాల, అర్చన సేవలకు రూ.5వేలు
- వేద ఆశీర్వచనానికి రూ.10 వేలు
- కళ్యాణోత్సవానికి రూ.2,500
- వస్త్రాలంకరణ సేవా టికెట్ ధర రూ.లక్ష
- అన్నమయ్య నడక మార్గం అభివృద్ధి…తాత్కాలిక పనులకు శ్రీకారం
- తిరుపతి బాలాజీ జిల్లా కలెక్టరేట్ కోసం టీటీడీ పద్మావతి నిలయం ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయం
- రూ.3,096 కోట్ల అంచనాతో 2022-23 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం
- రూ.230 కోట్లతో పద్మావతి చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం
- రూ.2.73 కోట్లతో స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి, కంప్యూటీకరణ
- టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవల కోసం రూ.25 కోట్లు
- నాదనీరాజనం మండపాన్ని శాశ్వత ప్రాతిపాదికన నిర్మించేందుకు నిర్ణయం
- రూ. 3.6 కోట్ల వ్యయంతో ఆయుర్వేద ఫార్మసీ అభివృద్ధి చేసేందుకు నిర్ణయం
- శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు మరో రూ.150 కోట్లు విడుదల
- సిఫార్సు లేఖపై ఇచ్చే ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపు
- కొండపైన అన్ని చోట్లా అన్న ప్రసాదం అందించాలని నిర్ణయం.
- అన్న ప్రసాద భవనంలో ఆహారం తయారీకి సోలార్ ప్లాంట్ ఏర్పాటు.
- తిరుపతిలో అలిపిరి వద్ద 50 ఎకరాల్లో ఆధ్మాత్మిక నగరం ఏర్పాటు
- మహాద్వారం, బంగారు వాకిలి, ఆనందనిలయానికి బంగారు తాపడం