కొత్త ఏడాదితో పాటు.. కొన్ని అంశాలకు సంబంధించి కొత్త నిబంధనలు తెర మీదకు రావటం తెలిసిందే. ఇప్పుడు చెప్పేది ఆ కోవలోకే వస్తుంది. బ్యాంకుల్లో పర్సనల్ లోన్ ఎక్కువగా తీసుకునే వారు.. ఈ కొత్త ఏడాది నుంచి కాస్తంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం చాలా అవసరం. దీనికి కారణం రిజర్వు బ్యాంక్ ఇండియా తీసుకొచ్చిన కొత్త నిబంధనలే. తక్కువ వ్యవధిలో పలు బ్యాంకుల్లో ఎక్కువ సంఖ్యలో రుణాలు తీసుకునే వారికి చెక్ చెప్పేలా కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం బ్యాంకులు తమ రుణ రికార్డుల్ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నివేదించాల్సి ఉండేవి. గతంలో ఈ రూల్ నెల రోజులకు ఒకసారి అన్నట్లు ఉండేది.
తాజా నిబంధన ప్రకారం రికార్డులు తరచూ అప్ డేట్ అవుతుండటం వల్ల రుణాల విషయంలో ఎక్కువగా తనిఖీలు జరుగుతాయి. దీంతో.. ఒకేసారి పలుచోట్ల రుణాలు తీసుకునే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇంతకూ ఇలాంటి రూల్ ను ఆర్ బీఐ ఎందుకు తీసుకొచ్చింది? దీని వెనుకున్న అసలు కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఎస్ బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసుల శెట్టి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. తమ రుణ సామర్థ్యానికి మించి పలు బ్యాంకుల నుంచి కొంతమంది రుణాలు తీసుకుంటున్నారని.. తాజా రూల్ తో ప్రజలు అధిక రుణాలు తీసుకోకుండా అడ్డుకట్ట వేసే వీలుందని పేర్కొన్నారు.
నిజానికి ఈ రూల్ ను గత ఏడాది ఆగస్టులోనే తీసుకొచ్చినప్పటికీ.. బ్యాంకులు.. క్రెడిట్ బ్యూరోలు వీటిని అమలు చేసేందుకు 2025 జనవరి వరకు గడువు ఇచ్చింది. వేర్వేరు రుణాలకు సంబంధించి నెలవారీ ఈఎంఐలు.. ప్రతి నెలలో వేర్వేరు తేదీల్లో ఉండొచ్చు. నెల రోజులకోసారి రుణ సమాచారాన్నివెల్లడించటంవల్ల బకాయిల తిరిగి చెల్లింపులు.. లేదంటే ఎగవేతల సమాచారం 40 రోజుల వరకు ఆలస్యమవుతోంది. 15రోజుల రిపోర్టింగ్ గడువు వల్ల ఆ లేట్ గరిష్టంగా తగ్గే వీలుందని చెబుతన్నారు. ఈ విధానంలో బ్యాంకులు రుణాలు ఇవ్వటానికి అవసరమైన కచ్ఛిత సమాచారం అందించేందుకు వీలు ఉంటుందని చెబుతున్నారు.