అంతకంతకూ పెరుగుతున్న అత్యాచారాలకు కఠినమైన శిక్షలు విధించాలన్న డిమాండ్ వినిపిస్తూ ఉంటుంది. అలాంటి తప్పులు చేసినోళ్లకు ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటే మానవహక్కులు.. వంకాయి అంటూ గళం విప్పే కొందరు మేధావుల్ని చూస్తేనే ఉన్నాం. అత్యంత దారుణమైన అత్యాచార నేరాలకు ఎలాంటి శిక్షలు విధించాలంటూ డ్రాయింగ్ రూంల్లో కూర్చొని తీర్పులు ఇచ్చే పెద్దమనషుల మాటలు సామాన్యులకు ఒళ్లు మండేలా చేస్తుంటాయి.
అత్యాచార నేరం చేయాలంటే వణికిపోయేలా శిక్షలు విధించాలన్న డిమాండ్ కు తగ్గట్లే పక్కనే ఉన్న పాకిస్తాన్ లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రేప్ కేసుల్ని విచారించేందుకు ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా రెండు ఆర్డినెన్సుల్ని తాజాగా తీసుకువచ్చింది. ఈ చట్టాలకు త్వరలో కేబినెట్ ఆమోదం పడాల్సి ఉంది.
కొత్త చట్టం ప్రకారం అన్ని వయస్కుల స్త్రీలను మహిళలుగా పరిగణిస్తారు. ఇప్పటివరకు ఉన్న చట్టం ప్రకారం పదిహేను సంవత్సరాల లోపు స్త్రీలతో సంభోగానని మాత్రమే రేప్ గా పరిగణిస్తారు. ఇప్పుడు మాత్రం అన్ని వయస్కుల వారికి జరిగే శారీరక దాడుల్ని రేప్ గా పరిగణిస్తారు.
అంతేకాదు.. నిందితుడు నేరాల్ని మొదటిసారి చేశాడా? తరచూ చేస్తున్నాడా? లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకొని శిక్షలు విధించనున్నారు. రేప్ నేరం రుజువు అయితే.. రేపిస్టులకు రసాయనాల ద్వారా వారి పుంసత్వాన్ని దెబ్బ తీసేలా శిక్షలు విధించనున్నారు. దేని కారణంగా అయితే మనిషి కాస్తా జంతువుగా మారుతున్నాడో.. వాడిలోని పుంసత్వాన్ని తొలగించటం ద్వారా.. కఠిన చర్యల్ని తీసుకోనున్నారు. కొత్త చట్టం ప్రకారం రేప్ కేసులను ప్రత్యేక కోర్టులతో పాటు యాంటీ రేప్ సెల్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రేప్ లాంటి దారుణాలకు ఈ తరహా శిక్షల్ని అమలు చేస్తే బాగుంటుందని చెప్పక తప్పదు.