జగన్ సీఎం కావడం ఆంధ్రులు కలలుగన్న రాజధాని అమరావతికి అరిష్టంగా మారిందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయింది మొదలు…అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అందుకే, అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలు…నేడు శిధిలావస్థకు చేరుకున్నాయి. మూడు రాజధానులంటూ అమరావతిపై కక్ష సాధిస్తున్న జగన్…అమరావతిలో కొత్త నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుపడుతూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే చాలా భవననిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోగా…కొత్త నిర్మాణేవీ చేపట్టలేదు. విభజన తర్వాత రాష్ట్రంలో కొన్ని కేంద్ర సంస్థలు తమ కార్యాలయాలను పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే, అమరావతి రాజధాని అని అక్కడ స్థలాలు కేటాయించినా…జగన్ నిర్వాకం వల్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఏ కేంద్ర సంస్థ, ఇతర కార్యాలయాల వారు ముందుకు రాలేదు. ఏపీ రాజధాని అమరావతి అని చెబితే…మేం అక్కడ బిల్డింగ్ కట్టుకుంటాం మహా ప్రభో అంటూ ఆర్బీఐ అధికారులు మొత్తుకుంటున్న వైనం ఇటీవల చర్చనీయాంశమైంది. అదే సమయంలో అమరావతే ఏపీ రాజధాని అని కేంద్ర మంత్రి కూడా రాజ్యసభలో నిన్న వెల్లడించడంతో ఆ సందిగ్ధతకు తెరపడింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఓ సంస్థ తమ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత అమరావతిలో ఓ కొత్త నిర్మాణానికి ఇటుక పడింది. తుళ్లూరు, రాయపూడి గ్రామాల మధ్యలో తమకు కేటాయించిన స్థలంలో నేషనల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ప్రహరీ గోడ నిర్మాణం ప్రారంభించారు. తమకు కేటాయించిన రెండెకరాల భూమిలో ప్రహరీ గోడ నిర్మాణం, ఆ తర్వాత తొమ్మిది అంతస్తుల భవన నిర్మాణాలను మొదలుబెట్టారు. దీంతో, మళ్లీ అమరావతిపై ఆశలు చిగురించాయని అక్కడి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత తమ రాజధానిలో మళ్లీ ఇటుకల మోత మొదలైందని సంతోషిస్తున్నారు.