ఏపీలో యువ ముఖ్యమంత్రి ఉన్నారు. దాదాపు 3 వేల 6 వందల పైచిలుకు కిలోమీటర్ల మేరకు ఆయన పాద యాత్ర చేశారు. అలాంటి నాయకుడు, దాదాపు ఐదు కోట్ల పైచిలుకు ఉన్న ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తు న్న నేత.. అయినా.. ఆయన వృద్ధ నేత మాదిరిగా వ్యవహరిస్తున్నారని.. ఎక్కడా ప్రజల్లోకి రావడం లేదు. పరిస్థితులను కూడా సమీక్షించడం లేదు అని అంటున్నారు నెటిజన్లు. ఆయన ఒక విధంగా వృద్ధ ముఖ్యమంత్రిని తలపిస్తున్నారని.. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కరుణానిధికి ఏమాత్రం తీసిపోరని అంటున్నారు జనాలు.
అప్పట్లో కరుణానిధి కొన్నేళ్లపాటు.. తమిళనాడులో వీల్ చైర్ పాలన అందించారు. అనారోగ్యం కారణంగా.. ఆయన ఆ పనిచేశారు.దీనిలో అర్ధం ఉంది. తమిళ తంబిలు కూడా కరుణను అర్దం చేసుకున్నారు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో యువ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ.. ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజల కష్టాలు తెలుసుకోకపోవడం వంటివి చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పుడు కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఆక్సిజన్ కొరత.. వైద్యుల నిర్లక్ష్యం, బెడ్ల కొరత.. మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటి అనేక ప్రభుత్వ అలసత్వాలు, భ్రష్టత్వాలు.. కరోనా బాధితులకు ప్రాణసంకటంగా మారాయి.
ఈ నేపథ్యంలో .. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌ను వదిలి ప్రజారంగంలోకి దిగితే.. ఈ పరిస్థితులు తెలుసు కునేందుకు ఆయన జిల్లాల పర్యటన చేస్తే.. యంత్రాంగంలో బాధ్యత పెరుగుతుందనేది నెటిజన్ల మాట. అదేవిధంగా స్థానికంగా ఉన్న పరిస్థితులు తెలుసుకుని.. వాటిని చక్కదిద్దుకునే అవకాశం, విమర్శలు రాకుండా.. చేసుకునే అవకాశం ఆయనకు ఉంటుంది. కానీ, జగన్ అలా చేయడం లేదు. కేవలం తాడేపల్లికి పరిమితమై.. సమీక్షలతో మమ అనిపించి.. అధికారులపై బాధ్యతలు మోపితే.. జనాలకు ఎవరు రేపు సమాధానం చెప్పాలి? జనాలు ఎవరికి మాత్రం ఓటేయాలి? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
పొరుగునే ఉన్న ఒడిసాలో అక్కడ నవీన్ పట్నాయక్ వయోవృద్ధుడు అయినా.. యాక్టివ్‌గా తిరుగుతున్నారు. లైవ్‌లో మాట్లాడుతున్నారు. ఆసుపత్రుల విషయంలో ఆకస్మిక తనిఖీలు స్వయంగా చేస్తున్నారు. తాజాగా రాజధాని భువనేశ్వర్ లో ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా పర్యటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా యంత్రాంగం అలెర్టయింది. సీఎం సార్.. ఎప్పుడు ఎక్కడికి వస్తారో.. అని ఎవరికి వారు బాధ్యత గా వ్యవహరించడం ప్రారంభించారు. మరి వృద్ధ నేతలకే ప్రజల పట్ల ఇంత బాధ్యత ఉంటే.. ఏపీలో యువ నాయకుడినని చెప్పుకొనే సీఎం జగన్ వీరికన్నా దారుణంగా మారిపోవడం శోచనీయమని అంటున్నారు నెటిజన్లు.