నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కీలక రెడ్డి వర్గం నాయకులు వైసీపీ నుంచి దూరమవుతున్నారు. జిల్లాపై పట్టు ఉండడమే కాకుండా.. వారి ఆర్థిక పరిస్థితి కూడా బలంగానే ఉంది. వీరిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన వెళ్లిపోయేందుకు రెడీ అయ్యారు. ఇది కొంత వరకు సమంజసమే. కానీ, నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు.. కూడా పార్టీ మారుతున్నారనే సమాచారం హల్చల్ చేస్తోంది.
ఆదాల విషయాన్ని చూస్తే.. ఆయనను వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి బరిలో దింపుతామని పార్టీభావించింది. కానీ, అనూహ్యంగా ఈ విషయంలో యూటర్న్ తీసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వేరే వారిని కేటాయించింది. దీంతో ఆదాల రగిలిపోతున్నారు. ఇక్కడ తనను కాదని వేరే వారికి టికెట్ ఇచ్చినందుకు కాదు.. ఆయన కోపం.. తనను సంప్రదించకుండా చేసినందుకు! దీంతో ఈ విషయంపై పెద్ద రగడే పార్టీలో అంతర్గతంగా సాగుతోంది.
దీంతోనే ఆదాల తిరిగి టీడీపీలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈయన గత ఎన్నికల సమయం లో కూడా.. టీడీపీ నెల్లూరు టికెట్ ఎనౌన్స్ చేసిన తర్వాత.. తన కంపెనీలకు రావాల్సిన బకాయిలపై సంతకం చేయించుకున్నాక.. ఆ వెంటనే రాత్రికి రాత్రి వచ్చి వైసీపీలో చేరిపోయారు. అప్పట్లో ఈయన వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇక, ఇప్పుడు కూడా ఇదే తరహాలో ఆయన రాజకీయం ఉందని జిల్లాలో టాక్ వినిపిస్తోంది.
ఇక, ఏరికోరి రాజ్యసభకు పంపించిన.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా వైసీపీని వీడుతున్నారని, ఆయన ఇప్పటికే టీడీపీతో టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఆయన సతీమణికి అసెంబ్లీ టికెట్‌ను వైసీపీ నిరాకరించడమేనని తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యసబ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తన భార్యను అసెంబ్లీకి పంపించాలని చూస్తున్నారు. అయితే, ఆమెకు టీటీడీ మెంబర్ షిప్ ఇచ్చిన వైసీపీ దీంతో సరిపెట్టుకోవాలని సూచించింది. ఫలితంగా ఈ ఫ్యామిలీ కూడా పార్టీ మారుతోంది. అయితే.. ఎంత మందిపోయినా.. తాము బ్రతిమాలేది లేదని వైసీపీ అధిష్టానం తేల్చి చెబుతుండడం గమనార్హం.