ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. వచ్చిన తొలి విజయదశమి ఇదే. దీంతో కూటమి పార్టీలు.. తమ పాలనపై ఆత్మావలోకనం చేసుకుంటున్నాయి. ఈ 100-110 రోజుల్లో సాధించిన విజయాల పై ఏ పార్టీకి ఆ పార్టీ లెక్కలు వేసుకుంటున్నాయి. ఇది మంచి పరిణామం కూడా. ఏటిలో పడికొట్టుకు పోయినట్టు రోజులు గడిపేయడం కాకుండా.. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో ఆగి.. ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేది వ్యక్తులకే కాదు.. పార్టీలకు, ప్రభుత్వాలకు కూడా చాలా మంచిది.
టీడీపీ: కూటమి సర్కారును ముందుండి నడిపిస్తున్న పార్టీ టీడీపీ. మెజారిటీ సంఖ్యలో సీట్లు తెచ్చుకు ని.. మెజారిటీ మంత్రి పదవులు కూడా దక్కించుకున్న టీడీపీ గడిచిన 100 రోజుల పాలనలో విజయాలను మనన చేసుకుంటోంది. కీలకమైన చెత్త పన్నును రద్దు చేయడం, అదేవిధంగా భూముల విషయంలో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేయడం ఈ వంద రోజుల్లోనే జరిగాయి. అదేసమయంలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు మేలు చేశారు. అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ `ఇది మంచి ప్రభుత్వం` అనే పేరు తెచ్చుకోవడం గమనార్హం.
జనసేన: రాష్ట్రంలో మూడు పార్టీలను కూటమి కట్టించడంలో ముందున్న పార్టీ జనసేన, ఎన్నికలకు ముందు వేసిన కీలక అడుగులు ఈ పార్టికి 100 శాతం స్ట్రయిక్ రేటును సాధించి పెట్టాయి. డిప్యూటీ సీఎంగా జనసేన అధినే తపవన్ కల్యాణ్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ వంద రోజుల్లోనే ఆయన నిర్వహించిన గ్రామ సభలు.. ప్రపంచ రికార్డును నెలకొల్పాయి. ఇక, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో సనాతనధర్మ పరిరక్షణ క్రతువును ఆయన భుజాన వేసుకున్నారు. అదేవిధంగా సుపరిపాలన అందించేందుకు ఆయన వినూత్న రీతిలో ముందుకు సాగుతున్నారు. పంచాయతీలకు 4 కోట్ల రూపాయలు ఇచ్చారు.
బీజేపీ: కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం పంచుకున్న బీజేపీ .. ఏపీకి సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టింది. పోలవరం, రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి రహదారుల నిర్మాణం, విశాఖ రైల్వే జోన్ వంటి కీలక విషయాలపై బీజేపీ నాయకులు ఈ వంద రోజుల్లో దృష్టి పెట్టారు. అదేవిధంగా ఆర్థికంగానూ ఆశించినంత కాకపోయినా.. కొంత వరకు బాగానే స్పందిస్తుండడం గమనార్హం. బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్రంలోని వైద్య కళాశాలల నిర్మాణం, ఆసుపత్రుల బాగోగలను కూడాబాగానే పట్టించుకుంటున్నారు.