ఈ సోషల్ మీడియా జమానాలో అరచేతిలో అమరిపోయే స్మార్ట్ ఫోన్ లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాం. విద్య, వినోదం, వ్యాపారం…ఇలా అన్నింటినీ విపులీకరంచి చెప్పేందుకు పలు యూట్యూబ్ చానెళ్లు, ఫేస్ బుక్ పేజీలు, ట్విటర్ ఖాతాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది యువత వినోదం కోసం, తమ టాలెంట్ ను చూపించేందుకు యూట్యూబ్ వేదికగా అనేక షార్ట్ ఫిలిమ్స్, సందేశాత్మక వీడియోలు, బ్యూటీషియన్ టిప్స్, కుకరీ చానెళ్లతో కెరీర్ ను సైతం బిల్డ్ చేసుకుంటున్నారు.
అదే సమయంలో కొందరు వినోదం కోసం ప్రాంక్ యూట్యూబ్ చానెళ్లతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తున్నారు. అయితే, కొందరు యువత లైకులు, వ్యూస్, డబ్బుల కోసం ప్రాంక్ యూట్యూబ్ చానెళ్ల పేరుతో అసభ్యకరమైన కంటెంట్ ను రూపొందించి పబ్బం గడుపుకుంటున్నారు. నడిరోడ్డుపై వెళుతున్న మహిళలను వారి అనుమతి లేకుండా అసభ్యకర రీతిలో పట్టుకోవడం, వారికి ఇబ్బంది కలిగించే రీతిలో తాకడం, ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటివి చేసి ప్రాంక్ అంటూ కొందరు యూబ్యూట్ చానెళ్ల వారు తప్పించుకుంటున్నారు.
ఈ తరహా ప్రాంక్ లపై చాలామంది మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ…దానిని కూడా రికార్డు చేసి ప్రాంక్ వీడియోలో అప్ లోడ్ చేసి డబ్బులు దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ తరహా అసభ్యకర ప్రాంక్ లపై Youth Against Rape అనే ట్విటర్ ఖాతా ఫిర్యాదు చేసింది. కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్ ,రవిశంకర్ ప్రసాద్ లతో పాటు జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ప్రాంక్ వీడియోల పేరుతో కొత్త ట్రెండ్ నడుస్తోందని, వాటి ముసుగులోనూ లైంగిక హింస, పైశాచిక ఆనందానికి కొందరు యూట్యూబ్ చానెళ్ల నిర్వాహకులు పాల్పడుతున్నారని ట్వీట్ చేసింది.
యూట్యూబ్ లో డబ్బు సంపాదించడానికి ఇదో సులువైన మార్గమని ట్వీట్ చేసింది. ఓ ప్రాంక్ యూట్యూబ్ చానెల్ పెట్టుకొని ఇలా మహిళలకు ఇబ్బందికరమైన అసభ్యకర వీడియోలతో డబ్బు సంపాదిస్తున్నారని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన రేఖా శర్మ…ఆ తరహా ప్రాంక్ యూట్యూబ్ చానెళ్ల ఆగడాలను యూట్యూబ్ సంస్థ దృష్టికి తీసుకువెళతానని, తగిన చర్యలు తీసుకుంటానని రీ ట్వీట్ చేశారు.