కోలీవుడ్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. భారత్ లో సరోగసి చట్టానికి సంబంధించిన నియమనిబంధనలను ఉల్లంఘించి నయన్ దంపతులు సరోగసీ ద్వారా పిల్లల్ని కన్నారని దుమారం రేగింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై నయన్ దంపుతులు వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. ఆ వ్యవహారంపై ఏకంగా ఓ కమిటీ నియమించింది.
ఈ నేపథ్యలోనే తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖకు నయన్ దంపతులు ఇచ్చిన అఫిడవిట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాము సరోగసీ ద్వారా భారత్ లో పిల్లలను కనలేదని, యూఏఈలో ఉన్న తమ బంధువు అద్దె గర్భం ద్వారా కన్నామని నయన్ దంపతులు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే, పెళ్లయిన నాలుగు నెలలకే వీరు సరోగసీ ద్వారా పిల్లలను కనడంపై మరో వివాదం రేగింది. దీంతో, పెళ్లికి ముందే వీరు సరోగసి ద్వారా పిల్లలకు కనడం చట్ట విరుద్ధమని కొత్త చర్చ మొదలైంది.
ఈ క్రమంలోనే ఆ ఆఫిడవిట్లో నయన్ దంపతులు మరో సంచలన విషయాన్ని బయట పెట్టినట్లు తెలుస్తోంది. ఆరేళ్ల క్రితమే తాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని వారు వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి 2015 నుంచి వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. కానీ, అధికారికంగా మాత్రం ఈ ఏడాది జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 9న కవల పిల్లలకు సరోగసీ ద్వారా జన్మనిచ్చారు. వాస్తవానికి సరోగసి చట్టం ప్రకారం పెళ్లి అయిన ఐదేళ్ల వరకు పిల్లలు లేకపోతేనే ఈ విధానం ద్వారా పిల్లలకు దంపతులు అర్హులవుతారు.