మిస్సోరి రాష్ట్రం లోని సెయింట్ లూయిస్ పట్టణంలో గల హిందూ మందిరంలో (The Hindu Temple of St. Louis, Missouri), ఆరుబయలు మండపంలో రంగరంగ వైభవంగా వేంకటేశ్వర స్వామి వారికి సహస్రదీపాలంకార సేవ జరిగింది. ఉత్తర అమెరికాలోనే మొట్ట మొదటిసారి తిరుపతిని తలపించే రీతిలో సాలంకృత మంటపంలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఎంతో పవిత్రంగా నయనమనోహరంగా సాగింది. ఒకవంక వేదమంత్రాలు, మరోవంక భక్తి గీతాలు వీక్షకులను తన్మయులను చేశాయి.
కోవిడ్ అంటువ్యాధి ముసురుతున్న ఈ కాలంలోనూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుండి రక్షణ కల్పించమని ఆ పరమాత్ముని భక్తులందరూ వేడుకున్నారు. మందిర ధర్మకర్తల మండలి మరియు స్వచ్ఛంద కార్యకర్తలెందరో శ్రమించి, అతితక్కువ కాలంలో 1008 దీపాలతో మందిరాన్ని కన్నులపండుగగా అలంకరించడం, గర్వించదగిన విశేషం. భక్తులందరూ ఎంతో బాధ్యతతో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పూజాకార్యక్రమాలను దిగ్విజయం చేసినందుకు మందిర యాజమాన్యం కృతఙ్ఞతలు ప్రకటించింది.