చంటిగాడు లోకల్ డైలాగ్ ఎంతకీ పాతపడదు. కొన్నంతే… రాజకీయాల్లోనూ ఇది పాపులర్ అయ్యింది. త్వరలో జరిగే వయనాడ్ ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరు.. గాంధీ ఫ్యామిలీలో కీలక సభ్యులురాలు.. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్రియాంక వాద్రాపై బరిలోకి దింపేందుకు లోకల్ వ్యక్తిని ఎంపిక చేసింది బీజేపీ. తాజాగా విడుదల చేసిన అధికారిక జాబితాలో వయనాడ్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్ ను ప్రకటించారు. ఇంతకూ ఈ నవ్య హరిదాస్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్.. రాయ్ బరేలీ నుంచి పోటీ చేయగా.. రెండింటిలోనూ గెలుపొందారు. దీంతో.. ఆయన వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో.. ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంకపై బరిలోకి దింపే అభ్యర్థిగా డైనమిక్ లీడర్ గా పేరున్న నవ్య హరిదాస్ ను ఎంపిక చేశారు.
2007లో బీటెక్ పూర్తి చేసి.. కోజికోడ్ కార్పొరేషన్ కు రెండు సార్లు కౌన్సిలర్ గా పని చేసిన ఆమె.. కార్పొరేషన్ లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. 2021లో జరిగిన కోజికోడ్ సౌత్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు.కానీ.. ఫలితం ప్రతికూలంగా వచ్చింది.
తాజా ఎన్నికల్లో మరోసారి ఆమెను బరిలోకి దించుతూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. స్థానికంగా ఉండే నేతకు ఉండే సానుకూలతను ఉపయోగించుకోవాలన్నది కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. సదరు అభ్యర్థి వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఇక.. ఆమె సోషల్ మీడియా అకౌంట్ ను చూస్తే.. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసినట్లు పేర్కొన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా.. బీజేపీ ఎంఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పేర్కొన్నారు.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ ప్రకారం నవ్య హరిదాస్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఆమె ఆస్తుల విలువ రూ.1.29 కోట్లుగా చెబుతున్నారు.
అదే సమయంలో రూ.1.64 లక్షల అప్పులు ఉన్నట్లుగా ఏడీఆర్ తెలిపింది. ఈ ఉప ఎన్నిక నవంబరు 13న జరగనుంది. ఫలితాలు నవంబరు 23న వెల్లడి కానున్నాయి. తన అభ్యర్థిత్వంపై నవ్య హరిదాస్ స్పందిస్తూ.. వయనాడ్ ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిగా తనను పార్టీ ఎంపిక చేయటంపై ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘‘చుట్టపుచూపుగా వయనాడ్ కు వచ్చే వారు కాకుండా.. ప్రజలతో ఉండి. వారి సమస్యలను అవగాహన చేసుకునే.. పరిష్కరించేందుకు ప్రయత్నించే వ్యక్తే వయనాడ్ కు అవసరం. బీజేపీ ఆలోచన కూడా అదే. వయనాడ్ డెవలప్ మెంట్ కు ప్రజలతో కలిసి పని చేసేందుకు.. వారి సమస్యల్ని పార్లమెంటుకు తీసుకెళ్లేలా పని చేస్తా’’ అని పేర్కొన్నారు. ఇక.. ఈ ఎన్నికల్లో ప్రియాంక గెలుపు అవకాశాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
బలమైన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రియాంక గెలుపు నల్లేరు మీద నడకగా చెప్పినప్పటికి.. గ్రౌండ్ లో అలాంటి పరిస్థితి లేదన్న మాట వినిపిస్తోంది. రాహుల్ గాంధీని అక్కున చేర్చుకొని గెలిపిస్తే.. గెలిచిన తర్వాత యూపీనే ముఖ్యమనుకొని మనల్నివదిలేయటమా? అన్న గుర్రుతో వయనాడ్ ఓటర్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ప్రియాంకకు ఇబ్బంది కలిగించే మరో అంశం ఏమంటే.. ఇండియా కూటమిలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న సీపీఐ కూడా తమ అభ్యర్థిని ఈ ఉప ఎన్నికల బరిలో నిలుపుతున్నారు. ఇది.. కొంత ఇబ్బందికి గురి చేస్తుందని చెబుతున్నారు.
మరోవైపు.. కాంగ్రెస్ గెలుపు ధీమాను వ్యక్తం చేయటమేకాదు.. రాహుల్ గాంధీకి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువగా వచ్చేలా ప్లాన్ చేసి గెలిపిస్తామని చెబుతున్నారు. అయితే.. మాటలు చెప్పినంత తేలిక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.