జగన్ మోహన్ రెడ్డి కలలో కూడా నవరత్నాలే కనిపిస్తాయి. అవే తనను మళ్లీ గెలిపిస్తాయని ఆయన నమ్మకం. చివరకు దేవీ నవరాత్రుల గురించి మాట్లాడమన్నా కూడా నవరాత్రుల గురించే జగన్ మాట్లాడిన విషయం చూశాం. అయితే ఈ నవరత్నాల గురించి కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న నవరత్నాలు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. నవరత్నాల పేరుతో జగన్ ప్రజల నవరంధ్రాలు మూసివేస్తున్నారని విమర్శించారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రం అంధకారంలోకి పోతుందని, ఇంత అసమర్థ నేతను ఎన్నడూ చూడలేదన్నారు. వచ్చే నెలలో అసలు రోజు రెండు మూడు గంటలు అయినా విద్యుత్ ఉంటుందో లేదో తెలియదని, ఇంత చేతకాని సీఎం ఏ రాష్ట్రానికి లేరన్నారు. రాబోయే రోజుల్లో కోతలు దారుణంగా ఉండబోతున్నాయన్నారు.
పేదలను ఆదుకోవడం మంచిదే కానీ నవరత్నాల పేరిట డబ్బుల పంచడం కోసం రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బందుల పాలు చేయడం ఏంటి? అన్నీ ఆపేసి నవరత్నాలకు వాడేస్తున్నారు. రాష్ట్రంలో 80 లక్షల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ ఛార్జీలు రెండేళ్ళ నుంచి ఇవ్వలేదు… కానీ దీని గురించి ఎవరూ రాయడం లేదు. మాట్లాడటం లేదు.
ఇప్పుడున్న రాజకీయ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్లు గతంలో స్కాలర్షిప్పులు తీసుకున్నవారెందరో ఉన్నారన్నారు. వారు కూడా దీనిని గుర్తించడం లేదు. ఇంతకాలం రైతు ఆత్మహత్యలే చూశాం.ఇకపై జగన్ పాలనలో విద్యార్థుల ఆత్మహత్యలు ప్రారంభమవుతాయని చింతా మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు.