యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ల కాంబోలో దర్శక ధీరుడు ‘మహారాజ’మౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించిన సంగతి తెలిసిందే. తారక్, చెర్రీలు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి నటించడం…రాజమౌళి మరోసారి తన మార్క్ డైరెక్షన్ తో మెప్పించడంతో ఈ చిత్రం అమెరికా సహా ఓవర్సీస్ లోని ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఈ సినిమాతో చెర్రీ, తారక్ లు పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ హీరోలుగా మారిపోయారు.
దీంతో, ఈ సారి ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ కు అవార్డుల పంట పండుతుందని భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డులకు ఆర్ఆర్ఆర్ చిత్రంంలోని నాటు నాటు పాట షార్ట్ లిస్ట్ అయింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఆ పాట షార్ట్ లిస్ట్ అయింది. ఎన్టీఆర్, చెర్రీలు నాటు నాటు అంటూ ఊరనాటు స్టెప్పులతో అదరగొట్టడంతో ఆ పాట ఆస్కార్ అవార్డు తప్పక గెలుస్తుందని అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. షార్ట్ లిస్ట్ కావడంతో ఈ ఘనత సాధించిన భారత చలన చిత్ర తొలి పాటగా నాటు నాటు రికార్డు సృష్టించింది.
ఈ క్రమంలోనే ఈ పాటకు తాజాగా మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు-2022ను ‘నాటు నాటు’ పాట దక్కించుకుంది. ఈ అవార్దు దక్కించుకున్న తొలి భారతీయ పాట ఇదే కావడం విశేషం. అంతేకాదు, ఈ కేటగిరీలో అవార్డు సాధించిన తొలి ఆసియా చిత్రం కూడా ఇదే కావడం గర్వకారణం. దీంతో, కీరవాణితోపాటు చిత్ర టీం అందరికీ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.
కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, కీరవాణి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ‘నాటు నాటు’ పాటకు పురస్కారం ప్రకటించిన వెంటనే వారంతా ఎగిరి గంతేశారు. అంతా చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— DVV Entertainment (@DVVMovies) January 11, 2023