టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది. ఆస్కార్ బరిలో కూడా ఈ పాట నిలుస్తుందా లేదా అని ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే అందరి అంచనాలను అందుకుంటూ తొలిసారి ఓ తెలుగు పాట ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది.
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ నామినేషన్ ఖరారైంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట చోటు దక్కించుకుంది. హోల్డ్ మై హ్యాండ్ (టాప్ గన్ మావెరిక్), దిసీజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్), అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమన్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్) గీతాలు కూడా ఆస్కార్ తుది నామినేషన్లలో చోటు దక్కించుకున్నాయి.
మరోవైపు, జపాన్ 46వ అకాడమీ అవార్డుల్లో విదేశీ చిత్రాల విభాగంలో అవుట్ స్టాండింగ్ ఫిల్మ్ పురస్కారానికి ఆర్ఆర్ఆర్ ఎంపికైంది. ఈ అవార్డు రేసులో జేమ్స్ కామెరాన్ కళాఖండం అవతార్-2 ను తోసి రాజని ఆర్ఆర్ఆర్ విజేతగా నిలవడం విశేషం. జపాన్ లో విడుదలైన ఆర్ఆర్ఆర్ కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జపాన్ లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది.