జగన్ పాలనలో నాడు-నేడు కార్యక్రమం పేరుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్న సంగతి తెలిసిందే. గవర్నమెంట్ స్కూళ్ల ఫొటోలు పెట్టి మరీ అధికార పార్టీ నేతలు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం బడులు మూసివేద్దామన్న ఆలోచనతో ముందుకు వెళ్లిందని, కానీ తాము నాడు-నేడు పేరుతో పాఠశాలల స్థితిగతులను పూర్తిగా మార్చివేశామని చెప్పుకుంటున్నారు. అయితే, ఇదంతా ప్రచార ఆర్భాటమేనని..వాస్తవం మరోలా ఉందని తాజా ఘటన చెబుతుంది.
అయితే, జగన్ హయాంలో కొన్ని గిరిజన ప్రాంతాలలో అసలు బడి లేని వైనం ఇపుడు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్సీ) నోటీసులు కూడా జారీ చేయడం సంచలనం రేపుతోంది. ఏపీలోని గిరిజన గ్రామాల్లో పాఠశాలలు లేకపోవడంపై ఎన్ హెచ్ఆర్సీ సీరియస్ అయింది. అల్లూరి జిల్లా జాజులబండలో ప్రభుత్వ పాఠశాల లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం వివరణ కోరింది.
ఆ మారుమూల గిరిజన గ్రామంలో 60 మంది విద్యార్థులున్నారని, కానీ, ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో విద్యార్థులు 6 కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు దాటుకుంటూ పాఠశాలకు నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల ఈతి బాధలపై ఓ స్వచ్ఛంద సేవా సంస్థ స్పందించి తాత్కాలిక పాఠశాల ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఆ ఘటన వెలుగులోకి రావడంతో దానిపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది.
ఈ అంశాన్ని ఎన్ హెచ్ఆర్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఎన్ హెచ్ ఆర్సీ…..కనీసం, ఆ ఎన్జీవో ఏర్పాటు చేసిన పాఠశాలలో టీచర్ ను నియమించకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీసింది. పాఠశాల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని, ఈ వ్యవహారంపై తగు వివరణనివ్వాలని ఆదేశించింది.