దేశంలో కరోనా వేరియెంట్ ఒమిక్రాన్.. తీవ్రస్థాయిలో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. అనూహ్యంగా ప్రజలను ఉద్దేశించి.. ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన నిర్ణయాలు ప్రకటించారు. దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని తెలిపారు. ఒమిక్రాన్ రకం వైరస్ విస్తృతి నేపథ్యంలో భయపడాల్సిన పని లేకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై ‘ముందు జాగ్రత్త (ప్రికాషన్) డోసు’ టీకా అందించనున్నామని చెప్పారు.
ఆరోగ్య విభాగ సిబ్బందికి దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్లు ప్రకటించారు. శనివారం రాత్రి ఆయన అనూహ్యంగా టీవీ ఛానళ్ల ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనాను ఎదుర్కోవడంలో ఇంతవరకు సాధించిన పురోగతిని, ఇకపై చేపట్టబోయే చర్యల్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా పిల్లల టీకాలపై ప్రకటన వెలువరించారు. వ్యక్తిగత స్థాయిలో అందరం జాగ్రత్తలు తీసుకోవడమే కరోనాపై పోరాటంలో పెద్ద ఆయుధమని, ప్రపంచ అనుభవాలు ఈ అంశాన్నే చాటుతున్నాయని ప్రధాని చెప్పారు. దీని దృష్ట్యా అన్ని రకాల జాగ్రత్తల్ని ప్రజలు పాటించాలని, అనవసర భయాలు పెట్టుకోవద్దని సూచించారు.
పండగల సమయంలో అప్రమత్తంగా ఉంటూ.. మాస్కులు ధరిస్తూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పారు. వైరస్‌కు కళ్లెం వేయడంలో టీకాల కార్యక్రమం మరో ముఖ్యమైన అస్త్రమని చెప్పారు. ముక్కు ద్వారా తీసుకునే చుక్కల టీకా త్వరలోనే మన దేశంలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారిగా డీఎన్ఏ ఆధారిత టీకా కూడా మన దేశంలోనే రానుందని ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 16 నుంచి ప్రజలకు టీకాలు ఇవ్వడం ప్రారంభిస్తే ప్రజల ఉమ్మడి ప్రయత్నం, సంకల్ప శుద్ధితో అనూహ్య రీతిలో 141 కోట్ల టీకా డోసుల్ని అధిగమించామన్నారు.
దేశ జనాభాలో 61శాతం మంది వయోజనులకు రెండు డోసులూ అందాయన్నారు. 90శాతం పైగా వయోజనులకు కనీసం ఒక డోసు అందిందని తెలిపారు. ఇప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉన్న కలవరాన్ని తొలగించే రీతిలో 15-18 ఏళ్లవారికీ టీకాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. దేశంలో ప్రస్తుతం 18 లక్షల ఐసొలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ పడకలు ఉన్నాయి. పిల్లల కోసమే ఐసీయూతో కలిపి 90,000 పడకలు ఉన్నాయి. వ్యాక్సిన్ల అవసరాన్ని తగినంత ముందే గుర్తించి, అనుమతుల నుంచి సరఫరా, పంపిణీ, శిక్షణ సహా అన్నీ సత్వరం పూర్తయ్యేలా దృష్టి సారించినట్టు ప్రధాని వివరించారు.
మొదటి నుంచీ శాస్త్రీయ సిద్ధాంతాలు, శాస్త్రీయ విధానాల ప్రకారమే వైరస్‌పై పోరాడుతున్నామని ప్రధాని మోడీ చెప్పారు. అప్రమత్తంగా ఉండడం వల్లనే సాధారణ స్థాయికి జనజీవనాన్ని తీసుకురాగలిగామ న్నారు. ఇతర దేశాల కంటే మనవద్ద ఆర్థిక కార్యకలాపాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు. వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ సూచించారు.