రాజకీయ వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్.. ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ సంబరపడిపోవద్దని అన్నారు. అసలు యుద్ధం 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో జరుగుతుందన్నారు. 2024 తీర్పును 2022లోనే ప్రజలు ఇచ్చారని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్లో సెటైర్లు వేశారు.
2024 సార్వత్రిక ఎన్నికల తీర్పును 2022లోనే ప్రజలు వెలువరించారన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. భారత్ కోసం అసలు యుద్ధం 2024లోనే జరుగుతుందని, అప్పుడే విజేత ఎవరో తెలుస్తుందని ట్వీట్ చేశారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేవని అన్నారు. సాహెబ్‌కు ఇది తెలుసంటూ పరోక్షంగా మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
విపక్షాలపై మానసికంగా పైచేయి సాధించడానికి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను వారు ఇలా తెలివిగా ఉపయోగించు కుంటున్నార ని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలకు మోసపోవద్దని ప్రజలను కోరారు. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల్లోబీజేపీ సత్తా చాటగా.. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను 2022లోనే ప్రజలు నిర్ణయించారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు… అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగింట బీజేపీ విజయం సాధించడంపై మహారాష్ట్ర అధికార పార్టీ.. ఒకప్పటి బీజేపీ మిత్రపక్షం.. శివసేన వ్యంగ్యంగా స్పందించింది. కొన్నిసార్లు ఓటమికంటే విజయాన్ని జీర్ణించుకోవడమే కష్టమని వ్యాఖ్యానించింది. ఈ ఫలితాల ప్రభావం మహారాష్ట్రలో ఏ మాత్రం ఉండదని, కోతులు మద్యం సీసా పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో.. అలానే ఉంటుందని సామ్నా పత్రికలో సంపాదకీయం రాసుకొచ్చింది. బీజేపీకి యూపీలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పరోక్షంగా సహకరించిందని ఆరోపించింది.