రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తాం.. చరిత్ర తిరగరాస్తాం.. అనే మాటలు తరచుగా వినబడుతూనే ఉంటాయి. నాయకులు అంటూనే ఉంటారు. కానీ, ఎంతమంది చరిత్రను తిరగరాశారు? అంటే.. వేళ్లమీద లెక్కించు కున్నా.. చాలా తక్కువే. అయితే.. ఇలాంటి ప్రకటనలు లేకుండా.. ఎక్కడా ప్రగల్భాలు పలకకుండా.. తనదై న శైలిలో చరిత్రను సృష్టించారు.. రాజకీయ విజేతగా నిలిచారు.. ప్రధాని నరేంద్ర మోడీ!.. దాదాపు జాతీయ పత్రికలన్నీ.. ఆయన గురించి ఇదే విషయంపై ప్రత్యేకంగా ప్రచురించాయి. ఒక చాయ్ వాలా.. అతి పెద్ద బీజేపీలో ఒక ఆఫీస్ బేరర్.. నేడు చరిత్రను నిజంగానే సృష్టించారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబరు 7న మోడీ అనూహ్య రీతిలో పదవి స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఓటమి చవి చూడని నాయకుడు. తిరుగేలేని నేత. ముఖ్యమంత్రిగా.. ప్రధానిగా ఆయన తీరు నభూతో.. అన్నవిధంగా ఉందనడంలో సందేహం లేదు. అయితే, ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే నాటికి.. అసలు ఆయన ప్రజాప్రతినిధే కాదు. ఆయన అటు మండలిలోను, ఇటు అసెంబ్లీలోనూ సభ్యుడు కాదు. అసలు సీఎం పీఠాన్ని మోడీకి అప్పగించడమే ఇష్టంలేని కోటరీని జయించిన తీరు కూడా మరెవరికీ సాధ్యం కాదనడంలో ఎలాంటి సందేహం లేదు.
అవి బీజేపీ సీనియర్ నాయకుడు, ఆర్ ఎస్ ఎస్ వాది కేశూభాయ్ పటేల్ గుజరాత్‌ను పాలిస్తున్న రోజులు. మూడేళ్లు సాఫీగా సాగిపోయాయి. ఇంతలోనే అవినీతి కేసులు పెరిగిపోయాయి. ఐదు చోట్ల ఉప ఎన్నికలు వచ్చాయి. సదరు ఉప ఎన్నికలో అదికార బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. అదేసమయంలో కేశూభాయ్ అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యారు.
ఈ క్రమంలో బీజేపీ సహా ఆర్ ఎస్ ఎస్ నాయకత్వం సీఎంను మార్చాలని ప్రయత్నించింది. ఈ సమయంలో సమర్ధుడైన నాయకుడి కోసం పరిశీలన జరిగింది. మోడీ తెరమీదికి వచ్చారు. కానీ, ఆయన నాయకత్వానికి అద్వానీ అడ్డు తగిలారు. కానీ, తన చతురతతో పెద్దలను మెప్పించిన మోడీ.. అటల్ సౌజన్యంతో సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు.
అప్పటికి ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. ఈ క్రమంలోనే 2002, ఫిబ్రవరి 22న రాజ్‌కోట పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నాయకుడితో రాజీనామా చేయించి.. మోడీ పోటీ చేసి.. గెలుపు గుర్రం ఎక్కారు. ఇక, అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.
2014లో ఆయన ప్రధానిగా ఢిల్లీ పీఠం ఎక్కేవరకు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇక, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ.. వరుస విజయాలు సాధిస్తూ.. తిరుగులేని మెజారిటీని సొంతం చేసుకుని గాంధీల కుటుంబ హవాకు బ్రేకులు వేశారు.
ఇక, ఇప్పుడు ప్రపంచంలోనే మేటి నాయకుడిగా మోడీ గుర్తింపు సాధించారు. దాదాపు 19 సంవత్సరాలుగా ఆయన సీఎంగా, పీఎంగా చక్రం తిప్పుతున్నారు. నిజానికి ఆయనకు పార్టీలోనే చాలా మంది వ్యతిరేకులు ఉన్నారు. ఆయన విధానాలను, సిద్ధాంతాలను వ్యతిరేకించే ఆర్ ఎస్ ఎస్ వర్గం కూడా ఉంది. అయినా.. అందరినీ మేనేజ్ చేయడంలో మోడీకి సాటి మరోనేత లేరనే భావన సర్వవ్యాప్తం.
అనేక ఎదురీతలు ఉన్నా.. అధిగమించడంలో చతురతే.. ఆయన అసలు విజయం.. అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా మాటల మాంత్రికుడిగా ఆయన చూపించే రాజకీయం నభూతో అన్నవిధంగా అందరినీ ఆకట్టుకుంటుంది. మోడీకి సాటి.. బీజేపీలో మరో నేత లేడనే రేంజ్లో ఆయన గుర్తింపు వెనుక.. కఠోరమైన దీక్షా దక్షతలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు.