2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తితో దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ దాడి కేసులో నిందితుడైన శ్రీనివాస్ కు నాలుగున్నరేళ్ల తర్వాత బెయిల్ రావడం అంతకన్నా సంచలనం రేపింది. దళితుడైన శ్రీనుకు నాలుగున్నరేళ్ల తర్వాత బెయిల్ దక్కడంపై విమర్శలు వచ్చాయి. ఇక, తాజాగా 2024 ఎన్నికలకు ముందు జగన్ పై రాయి దాడి జరిగిన నేపథ్యంలో శ్రీను తరహాలో ఈ సారి ఎవరు బలవుతారు అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ మరో కోడి కత్తి డ్రామాకు తెరతీశారని ఆనంద బాబు ఆరోపించారు. 2019 మాదిరిగానే 2024లో కూడా మరో కోడికత్తి నాటకం రెడీ అయిందని, ఈ సారి ఏ అమాయక దళిత యువకుడు బలి కాబోతున్నాడో అని విమర్శించారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను ఐదేళ్లు జైలులో ఉన్నాడని, ఇప్పుడీ రాయి డ్రామాకు ఏ దళితుడిని బలిచేస్తారోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఐప్యాక్ డైరెక్షన్లో ఇంకెన్ని డ్రామాలు చూడాల్సి వస్తుందోనంటూ సెటైర్లు వేశారు. ఈ రాయి దాడి స్క్రిప్ట్ ఐప్యాక్ రాసిందేనని ఆరోపించారు. వివేకా రక్తపు పునాదుల మీదే జగన్ ప్రభుత్వం ఏర్పడిందని సొంత చెల్లెళ్లు చెబుతున్నారని అన్నారు. వైసీపీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.
ఇక, ఈ దాడి ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన ట్వీట్ కూడా వైరల్ గా మారింది. కోడికత్తి తరహాలోనే ఇది కూడా మరో డ్రామా అనే అర్థం వచ్చేలా లోకేశ్ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. ‘‘రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్..? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా! కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్! అని లోకేశ్ ట్వీట్ చేశారు. అంతేకాదు, 2019 లో కోడి కత్తి, 2024 లో రాయి అని వాటి ఫొటోలను షేర్ చేశారు.