టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర 30 రోజులు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో లోకేష్ దాదాపు 400 కిలోమీటర్లు నడిచారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ కు కాసిపెంట్ల గ్రామంలో హెరిటేజ్ ఉద్యోగులు పుష్పగుచ్చాలతో, భారీ గజమాలతో స్వాగతం పలికారు. 30 రోజుల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా 30వ నెంబర్ షేపులో ఉన్న కేకును లోకేష్ తో హెరిటేజ్ ఉద్యోగులు కట్ చేయించారు.
ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన లోకేష్….జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. సమస్యలపై ప్రశ్నించి ప్రభుత్వంపై తిరగబడకపోతే బతకలేమని లోకేష్ అన్నారు. తన జీవితంలో జైలు ముఖం ఎరుగనని, కానీ, జగన్ పాలనలో జనం కోసం జైలుకు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. తనపై దొంగ కేసులు పెట్టి పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని, అటువంటి కేసులు పెట్టిన అధికారులపై విచారణ చేసి బట్టలూడదీస్తామని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.
ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నందువల్లే అట్రాసిటీ చట్టం తీసేయాలన్న చర్చ కూడా జరుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించిన వారిని వైసీపీ సర్కార్ వేధిస్తోందని, మహిళలపై కూడా కేసులు పెడుతోందని లోకేష్ మండిపడ్డారు. మహిళలు కూడా పోరాడాలని టిడిపి వారికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మహిళల జోలికి వైసిపి కుక్కలు వస్తే తనతో చెప్పాలని, ఆ కుక్కల తోలు ఒలుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చారు. ఆనాడు… ఈనాడు మహిళలకు చంద్రబాబు భద్రత, భరోసా కల్పించే నాయకుడని లోకేష్ గుర్తు చేశారు. మోసకారి హామీలతో మహిళలను నట్టేట ముంచిన ఘనత జగన్ అని, అటువంటి జగన్ రెడ్డిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జగన్ చూస్తే జైలు గుర్తొచ్చిందని, చంద్రబాబును చూస్తే పరిశ్రమలు గుర్తొస్తాయని అన్నారు. కాండూర్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు లోకేష్ సెల్ఫీ దిగి జగన్ కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఆ విద్యా సంస్థ టీడీపీ హయాంలో ఏర్పాటు అయిందని జగన్ ఏం చేశారో చెప్పాలని లోకేష్ సవాల్ విసిరారు.