ఏపీలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేయడానికి సీఎం జగనే కారణమని వైసీపీ ఎంపీలు మాట్లాడుకుంటున్న వీడియో ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోన్న సంగతి తెలిసిందే. కరోనాపై జగన్ చేతులెత్తేశాడంటూ ఆ పార్టీ నేతలు విమర్శించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. కరోనా కట్టడిలో జగన్ విఫలమయ్యారని తాము చెబుతుంటే విపక్షాల విమర్శలని కొట్టిపారేశారని, ఇపుడు ఆ పార్టీ నేతలే ఈ విషయాన్ని అంగీకరించారని టీడీపీ నేతలు అంటున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ రెడ్డి చేతగాని పాలనను జనమే కాకుండా సొంత పార్టీ నేతలే ఎండగడుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ ది పనికిమాలిన పాలన అని, ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. జగన్కు ఈ విషయం చెబితే కక్షసాధింపులకు దిగుతారేమోనని ఎవరూ నోరు మెదపట్లేదని లోకేశ్ అన్నారు. జగన్ మూర్ఖత్వాన్ని, చేతగాని పాలనను, కరోనా వైఫల్యాన్ని వైసీపీ సీనియర్ నేతలే కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని విమర్శించారు.
‘‘కరోనా నియంత్రణకి జగన్ ఏం చేశాడు? బొక్క చేశాడు…’’ అంటూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పిల్లి మెడలో తొలి గంటకట్టారని లోకేశ్ ట్వీట్ చేశారు. ‘‘ప్రభుత్వం లాజిస్టిక్స్ మెయింటేన్ చేయడం లేదు. జగన్ చేతులెత్తేశాడు’’ అని ఆకుల సత్యనారాయణ అన్న వ్యాఖ్యలను కూడా లోకేశ్ ట్వీట్ చేశారు. శవాల దహనం కోసం కూడా చందాలు వేసుకోవాల్సి వస్తుందని వైసీపీ నేతలే వాపోతున్నారంటూ లోకేశ్ దుయ్యబట్టారు.
తాను జగన్ను విమర్శిస్తే బూతుల మంత్రినో, పేటీఎం బ్యాచ్లను ఫేక్ ట్వీట్లతోనో రంగంలోకి దింపేవారని, ఇపుడు జగన్ను మూర్ఖపు రెడ్డి అని నర్మగర్భంగా వ్యాఖ్యానించిన సొంత పార్టీ నేతలపై కూడా పేటీఎం బ్యాచ్ ను దింపుతారో లేదో అని లోకేశ్ ఎద్దేవా చేశారు.
కాగా, కరోనా ముదిరిన తర్వాత వచ్చి ఆక్సిజన్ అడిగితే ఎక్కడ నుంచి తెస్తాం?’ అంటూ మంత్రి పేర్ని నాని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని లోకేశ్ దుయ్యబట్టారు. బెడ్లు, ఆక్సిజన్, మందులు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. పేర్ని నాని తక్షణమే ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కనీస వైద్య సౌకర్యాలు కల్పించమని ముఖ్యమంత్రిని నిలదీయాలన్నారు.