ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, మద్యపాన నిషేధం కోసం జగన్ అనుసరిస్తున్న విధానాలపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. మద్యపాన నిషేధం పేరుతో జగన్ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని నాసిరకం బ్రాండ్ లను ఏపీలో అమ్ముతున్నారని, వాటివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటోందని అంటున్నారు.
ఇక తాజాగా ఏపీలో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో కూరగాయల కొట్లు తెరవడానికి ముందే లిక్కర్ షాపులు తెరవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తానన్న జగన్…ఆ హామీని నెరవేర్చడం సంగతి పక్కనపెట్టి…సొంత బ్రాండ్ మద్యం అమ్ముతున్నారని లోకేశ్ మండిపడ్డారు.
దశలవారీ మద్యనిషేధం చేస్తామన్న వైఎస్ జగన్ గారు.. దశలవారీగా మద్యం అమ్మకం వేళలు మారుస్తున్నారంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. తెల్లారి పాల ప్యాకెట్లు అమ్మే సమయానికి కంటే ముందే మద్యం షాపులు తెరిచి ఏం సందేశం ఇస్తున్నారంటూ లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఓ వైపు కరోనా మందుల్లేక ప్రాణాలు పోతుంటే …. తన సొంత బ్రాండ్ మందు ప్రెసిడెంట్ మెడల్ తాగమంటున్నట్టుంది జగన్ ఎవ్వారం అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు.
ఓ పక్క ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోందని, బెడ్లు, ఆక్సిజన్, వ్యాక్సినేషన్ వంటి విషయాలను జగన్ గాలికొదిలేసి లిక్కర్ షాపులు 6 గంటలకే తెరవాలంటూ ఆదేశాలిచ్చారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ప్రజల్ని దోపిడీ చెయ్యడానికి ప్రభుత్వం పరితపించడం దారుణం అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.