సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలు కూడా అవకతవకలతోనే సాగాయని లోకేశ్ ఆరోపించారు. కానీ, అత్యంత పారదర్శకంగా డిజిటల్ మూల్యాంకనం చేశామని కోర్టుకి జగన్ సర్కారు నివేదించిందని, డిజిటల్ విధానంలో ఎంపికైన 326 మందిలో 124 మంది మాత్రమే మాన్యువల్ వేల్యూయేషన్లో ఎంపిక కావడం వెనుక మతలబేంటో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
డిజిటల్ మూల్యాంకనంలో మాయాజాలం జరిగిందా?.. లేదంటే మాన్యువల్ వ్యాల్యూషన్ లో అవకతవకలు జరిగాయా అంటూ జగన్ ను లోకేశ్ ఇరుకున పడేశారు. ఈ అక్రమాలపై గవర్నర్ దృష్టి సారించాలని, నిష్పాక్షికమైన న్యాయవిచారణ జరిపించాలని, అర్హులై ఎంపిక కాని అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.
మరోవైపు, వైసీపీ సామాజిక న్యాయభేరిపై కొన్ని వార్తాపత్రికలు అసత్య కథనాలు రాస్తున్నాయని కర్నూలు మేయర్ బీవై రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే వీపులు వాయగొడతామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో, ఈ కామెంట్లపై లోకేశ్ స్పందించారు. వీపులు మీడియా వాళ్లకే కాదు… మీకు కూడా ఉంటాయని వైసీపీ నేతలకు లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.
ఎప్పుడు మీ వీపులు విమానం మోత మోగిద్దామా అని నాలుగు కోట్లకు పైగా ఉన్న ఏపీ ఓటర్లు ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. మర్యాదగా మీడియా ప్రతినిధులకు కర్నూలు మేయర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ సామాజిక న్యాయభేరీకి జనాలు రావడం లేదని, అధికారులు బెదిరించి తెచ్చినా కూడా జనం పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వాస్తవాలు రాసే, చూపించే మీడియా ప్రతినిధుల వీపులు వాయగొడతారా మేయర్ గారు… ఇదేం రౌడీయిజం? అని లోకేశ్ ప్రశ్నించారు. అధికార మత్తులో నోరు పారేసుకోవద్దని హితవు పలికారు.