తాత మహానాయకుడు
తండ్రి దార్శనికుడు
ఇరువురి పేరు నిలిపేలా..
రాజకీయరంగంలో సంచలనాలు సృష్టిస్తోన్న తెలుగుదేశం యువతేజం నారా లోకేష్..
ఎండైనా, వానైనా, చలైనా, వడగాలైనా 226 రోజులపాటు 3132 కిలోమీటర్లు యువగళం పాదయాత్రతో పల్లెపల్లెకూ చేరారు నారా లోకేష్. ప్రజల మనిషిగా ఎదిగారు.
తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కర్త, కర్మ, క్రియ అన్నీ అయిన కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా కార్యకర్తల సంక్షేమ విభాగం బాధ్యతలు తీసుకుని నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనదైన శైలిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి పదవి చేపట్టి మూడుశాఖలను ప్రగతిపథంలో పరుగులు పెట్టించారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి 2019లో పోటీ చేసి 5 వేలు పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఓడిపోయినా నియోజకవర్గాన్ని వీడిపోలేదు..ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో పనిచేశారు.
మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు చేరువై సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
ప్రజల హృదయాలే కాదు…నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు.
సమాజమనే దేవాలయంలో ప్రజలని దేవుళ్లు అనే తాత నినాదం, నాన్న విధానం పుణికిపుచ్చుకున్న నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని మరో 30 ఏళ్లపాటు తిరుగులేని ప్రజాశక్తిగా నడిపించగల దమ్ము ధైర్యం ఉన్న నేత అని నిరూపించుకున్నారు.
నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులకు 1983 జనవరి 23న జన్మించారు. నాన్నది నారా వారి పల్లె. అమ్మది నిమ్మకూరు. బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది.
భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్, విద్యాశ్రమ్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు.
ఇంటర్మీడియెట్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ, హైదరాబాద్‌లో కంప్లీట్ అయ్యింది
అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు.
అమెరికాలో కార్నెగీ మెలన్ వర్సిటీలో బీఎస్సీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డిగ్రీ పొందారు.
హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ప్రెసిడెంట్‌గా, హెరిటేజ్ ఫిన్‌లీజ్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు.
వరల్డ్ బ్యాంకు మద్దతుతో వివిధ దేశాలలో అమలయ్యే కెపాసిటీ బిల్డింగ్ ప్రాజెక్ట్స్, ఈ గవర్నెన్స్, కనెక్టివిటీ సొల్యూషన్స్ అంశాలలో ప్రాజెక్టు మేనేజర్‌గా(2004-2006) పనిచేసిన నారా లోకేష్ స్వదేశానికి చేరుకున్నారు.
పూర్తిస్థాయి రాజకీయరంగ ప్రవేశం 2013లో చేసి, 2014 టిడిపి అధికారంలోకి రావడంలో కీలకపాత్ర వహించారు.
2024లో టిడిపి కూటమి అధికారంలోకి రావడంలో నారా లోకేష్ పోషించిన పాత్ర ఎనలేనిది.
మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై 39 ఏళ్లుగా అందని నియోజకవర్గంపై టిడిపి జెండా ఎగురవేశారు నారా లోకేష్.
టిడిపి సభ్యత్వాల ద్వారా ప్రమాదబీమా, కార్యకర్తల సంక్షేమనిధి ఏర్పాటు చేసిన నారా లోకేష్. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య-వైద్య సేవలు అందిస్తున్నారు.
టిడిపి నాయకత్వ శిక్షణ శిబిరాల ద్వారా 25 వేల మంది యువనాయకుల్ని తయారు చేసిన కార్యక్రమ రూపకర్త కూడా నారా లోకేషే కావడం గమనార్హం.
2015లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. 2018లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు
2018లో ఐటీ-ఎలక్ట్రానిక్స్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
30 ఏళ్ల వయస్సులోనే ముఖ్యమైన 3 శాఖల మంత్రిగా నారా లోకేష్ చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ,స్కోచ్ అవార్డులు దక్కాయి.
ఏ పొలిటికల్ అనే సంస్థ ప్రకటించిన జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుల్లో మొదటి 20 స్థానాల్లో నిలిచిన ఏకైక భారతీయుడు నాటి ఏపీ మంత్రి నారా లోకేష్.
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వినూత్న ఆలోచనలు, పాలనలో టెక్నాలజీ వినియోగం, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంపై నారా లోకేష్‌కి ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ ప్రకటించిన సింగపూర్ ఫారెన్ ఎఫైర్స్ మినిస్ట్రీ
ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అహరహం శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ యువతేజం నారా లోకేష్…స్వచ్ఛరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన, విద్య, వైద్య, మౌలిక, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై స్పష్టమైన విజన్‌తో ఉన్న నారా లోకేష్ …తాతకు తగ్గ మనవడు, తండ్రిని మించే తనయుడుగా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.
39 ఏళ్లకు టిడిపికి మంగళగిరిలో గెలుపు పిలుపు
– నారా లోకేష్ నాయకత్వంలో పసుపు జెండా రెపరెపలు
– 1985లో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు తరువాత ఇన్నేళ్లకు 2024లో నారా లోకేష్ విజయంతో రికార్డు
ఎన్నాళ్లకు-ఎన్నేళ్లకు మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపు పిలుపు వినపడి-పసుపుజెండా విజయగర్వంతో ఎగిరింది. 39 ఏళ్ల తరువాత మళ్లీ మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. మంగళగిరి నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేష్ భారీ మెజారిటీతో గెలిచారు. టిడిపి ఆవిర్భావం తరువాత 1983, 1985 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. అప్పటి నుంచీ మంగళగిరి నియోజకవర్గం పొత్తులతో కొన్నాళ్లు, పట్టు చిక్కక కొన్నాళ్లు అందని నియోజకవర్గం అయ్యింది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందుగా ప్రకటించినట్టుగానే మంగళగిరి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని మాట నిలబెట్టుకున్నారు.
39 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలుపు పిలుపు వినపడని మంగళగిరి నియోజకర్గాన్ని అత్యధిక మెజారిటీతో గెలిచి సంచలనం సృష్టించారు నారా లోకేష్. టిడిపి ఆవిర్భావం తరువాత 1985లో టిడిపి మంగళగిరిలో గెలిచింది. ఆ తరువాత 1989లో కాంగ్రెస్ అభ్యర్థి గోలి వీరాంజనేయులు, 1994లో సీపీఎం నుంచి ఎన్ రామమోహనరావు, 1999,2004లో కాంగ్రెస్ నుంచి మురుగుడు హనుమంతరావు, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కాండ్రు కమల, 2014,2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డిలు విజయం సాధిస్తూ వచ్చారు. మంగళగిరి నియోజకవర్గం టిడిపికి అందనిద్రాక్షలా మారింది. మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం జెండా ఎగురవేయడమే తన లక్ష్యం అంటూ ప్రతినబూని మరీ అహర్నిశలు కష్టపడి, ప్రజల మనస్సులు గెలుచుకుని నియోజకవర్గంలో విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు నారా లోకేష్.
చేనేతల యువనేత నారా లోకేష్
-చేనేతలకు ఉచితంగా మగ్గాల పంపిణీ
-టాటా తనేరియా సహకారంతో వీవర్ శాల ఏర్పాటు
-చేనేతను దత్తత తీసుకుంటున్నానని ప్రకటన
– ప్రధాని మోదీకి మంగళగిరి చేనేత శాలువాతో సత్కారం
యువనేత నారా లోకేష్ ని చేనేతలు అక్కున చేర్చుకున్నారు. తమవాడిని చేసుకున్నారు. తమలో ఒకడిగా భావించారు. చేనేతల సంక్షేమం, మంగళగిరి ప్రజల బాగోగులు చూస్తూ చేనేత కుటుంబసభ్యుడయ్యాడు నారా లోకేష్. మంగళగిరి చేనేతలకు పెట్టింది పేరు. మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికంగా చేనేతల జనాభా ఉంది. చేనేతవర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల వంటి వారు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా, ఏనాడూ చేనేతల సంక్షేమం కోసం ఆలోచించలేదు. వాళ్ల వ్యక్తిగత ఆస్తులు పెరిగాయి. మంగళగిరి చేనేతల బతుకుచిత్రం మాత్రం మారలేదు. 2019లో మంగళగిరి నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన నారా లోకేష్.. నేతన్నకు చేయూత అందిస్తూ వచ్చారు. పేదచేనేతలకు మగ్గాలు ఉచితంగా అందజేశారు. స్త్రీశక్తి పథకం ద్వారా చేనేత మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇప్పించి..కుట్టు మిషన్లు అందజేసి స్వయం ఉపాధి కల్పించారు. టాటా తనేరియా సహకారంతో మంగళగిరి చేనేత వస్త్రాలకు మంచి ధరలు అందించడంతోపాటు, దేశవ్యాప్తంగా బ్రాండింగ్ కల్పించేందుకు కృషి చేశారు. తాను ఓడిపోయాడు, తన పార్టీ ప్రతిపక్షంలో ఉంది..తానేం చేయగలను అని అనుకోలేదు నారా లోకేష్. చేనేతలను దత్తత తీసుకుంటానని ప్రకటించాడు. మంగళగిరితోపాటు రాష్ట్రంలో చేనేతలను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాడు. టిడిపి,బీజేపీ,జనసేన కూటమి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి మంగళగిరి చేనేతలు నేసిన పట్టువస్త్రాన్ని బహూకరించి మంగళగిరి చేనేతకు దేశవ్యాప్త ప్రచారం కల్పించారు.
లోకేష్ అభిమన్యుడు కాదు అర్జునుడు
-వైసీపీ కుతంత్రాలకు ఎదురొడ్డి విజేతగా నిలిచిన టిడిపి యువనేత
-జగన్ 22కి పైగా తప్పుడు కేసులు బనాయించినా వెనక్కి తగ్గని లోకేష్
– జగనాసుర రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించిన సవ్యసాచి
నారా లోకేష్ కుర్రాడు.. స్టాన్ ఫోర్డులో చదివాడు.. సాఫ్ట్ గా ఉన్నాడు.. ఫ్యాక్షన్ పద్మవ్యూహం పన్నేద్దాం. అభిమన్యుడిలా చుట్టేద్దాం అనుకుంది జగనాసుర ముఠా. కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు కేసులు-దాడులకి ఎదురొడ్డి నిలిచిన నారా లోకేష్ అభిమన్యుడు కాదని, అర్జునుడు అని అర్థమైంది. క్రియాశీల రాజకీయాల్లో లోకేష్ ప్రవేశించిన నుంచీ.. అవినీతి ఆరోపణల్లేవు, ఇతరత్రా కేసులు ఏవీ లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 22 తప్పుడు కేసులు బనాయించారు. హత్యకి గురైన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే కేసు, ట్రాక్టర్ నడిపాడని ఓ కేసు, కోవిడ్ గైడ్ లైన్స్ ఉల్లంఘించాడని మరో కేసు.. స్టూలు ఎక్కి మాట్లాడాడని ఇంకో కేసు బనాయించారు. యువగళం పాదయాత్ర ఆరంభం నుంచీ అడ్డుకునేందుకు వైసీపీ సర్కారు చేయని ప్రయత్నంలేదు. భద్రత కుదించారు. ఉన్న పోలీసులు మైకు, స్టూలు లాక్కోవడం, మాట్లాడటానికి వీల్లేదని నోటీసులు ఇవ్వడం, కేసులు బనాయించడం చేశారు. మొదట్లోనే సాగనిస్తే పాదయాత్ర..సాగనివ్వకుంటే దండయాత్ర అంటూ ప్రకటించిన నారా లోకేష్ ముందుకు సాగారు. ఓ వైపు తనపై కేసులు, మరోవైపు తండ్రి అక్రమ అరెస్టు, ఇంకో వైపు టిడిపి నేతలు-కార్యకర్తలపై తప్పుడు కేసులు.. న్యాయపోరాటాన్ని నమ్ముకున్నాడు లోకేష్. ఢిల్లీలో మకాం వేసి న్యాయకోవిదులతో చర్చలు, మరోవైపు కేంద్రంతో అప్పుడే పొత్తు ఎత్తులు ముగించి వచ్చాడు. తాత ధైర్యం, తండ్రి దార్శనికత, మేనమామ దూకుడు కలగలిసిన నారా లోకేష్ జగనాసుర రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించిన సవ్యసాచి. అభిమన్యుడు అనుకున్న వైసీపీ గ్యాంగుకి అర్జునుడిలా తయారయ్యాడు. టిడిపి లీడర్లకి ధైర్యం, కేడర్ కి అండ, పొత్తుల ఎత్తులు, అధికార అహంకారానికి ఎదురొడ్డి పోరాడి అభినవ అర్జునుడిగా రాజకీయ కురుక్షేత్రంలో కూటమిని విజయతీరాలకు చేర్చాడు. తెలుగుదేశం పార్టీకి 30 ఏళ్లపాటు నడిపించే రథసారధిగా నిలిచాడు.
తెలుగుదేశం మీసం తిప్పిన లోకేష్
– 2014,2024 విజయాలలో కీలక పాత్ర
– 2019లో ఓటమితో రాటుదేలిన టిడిపి యువనేత
– చట్టాల్ని ఉల్లంఘించిన వారిపై రెడ్ బుక్ అస్త్రం
తెలుగుదేశం మీసం తిప్పాడు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీలో 2013 నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ 2014 ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నా.. పోటీకి దూరంగా ఉండడంతో.. ఎన్నికల వ్యూహాలు, పొత్తుల చర్చలు, లీడర్ల మధ్య సమన్వయం, పోల్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణ ఇప్పించి వారిని భావినాయకులుగా తీర్చిదిద్దడంలో నారా లోకేష్ కీ రోల్ పోషించారు. 2014లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో యువనేత లోకేష్ చొరవ ప్రధాన కారణం. ఎమ్మెల్సీగా ఎన్నికై, మూడుశాఖల మంత్రిగా బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించారు. 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసి 5 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమి తరువాత నారా లోకేష్ రాటుదేలారు. అపజయం నుంచి గుణపాఠం నేర్చుకున్నారు. ఓడిపోవడం అంటే, ఆగిపోవడం కాదు..మరింత గొప్పగా పనిచేస్తూ విజయాన్ని సొంతం చేసుకోవడం అని నిర్ణయించుకున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలి అన్న నానుడిలాగే ఓడిపోయిన చోటే గెలవాలనే పట్టుదలతో మంగళగిరి నియోజకవర్గంలో పాగా వేశారు. మరోవైపు 23 సీట్లకే పరిమితమై, అధికార వైసీపీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగుదేశం పార్టీని నేనున్నానంటూ ముందుకొచ్చి మరీ నిలిచాడు. కేడర్ కి కష్టమొస్తే క్షణం ఆలస్యం చేయకుండా సాయం అందించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లీడర్లతో మాట్లాడుతూ ధైర్యం నింపాడు. ఒక్క కేసు పెడితే వంద కేసులు పెట్టుకోండంటూ సవాల్ విసిరాడు. చట్టాల్ని చుట్టాల్ని చేసుకుని టిడిపి నాయకులు, కార్యకర్తల్ని వేధిస్తున్న వారికి రెడ్ బుక్ వార్నింగ్ ఇచ్చి సంచలనం సృష్టించారు. ఎదురైన ప్రతీ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని 2024లో టిడిపి, బీజేపీ, జనసేన కూటమి విజయానికి దారులు వేశాడు నారా లోకేష్.
మన లోకేష్ అని నినదించిన మంగళగిరి
– ఓడిపోయినా నియోజకవర్గాన్ని వీడిపోని యువనేత
– నియోజకవర్గంలో పాదయాత్రతో ఇంటింటికీ వెళ్లిన లోకేష్
– అపార్ట్ మెంటు వాసులు, వీధుల్లో రచ్చబండ సమావేశాల నిర్వహణ
– తటస్థుల ఇళ్లకు వెళ్లి మంగళగిరి సర్వతోముఖాభివృద్ధికి కలిసి రావాలని పిలుపు
మంగళగిరి నియోజవర్గానికి 2019లో సరిగ్గా ఎన్నికలకు 20 రోజులు ముందు టిడిపి అభ్యర్థిగా వచ్చారు నారా లోకేష్. ఆ ఎన్నికల్లో 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయిన నుంచీ మంగళగిరి నియోజవర్గాన్ని వీడిపోలేదు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతీ ఇల్లూ, ప్రతీ వీధి, ప్రతీ ఊరు, ప్రతీ వర్గంని పలకరించి బాగోగులు తెలుసుకున్న యువనేత వారి ఆకాంక్షలు తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు, నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి గురించి స్పష్టమైన అవగాహనకు వచ్చారు. యువగళం పాదయాత్ర 2023 జనవరి 27న ప్రారంభించారు. పాదయాత్ర సుధీర్ఘంగా సాగవచ్చనే ముందుచూపుతో మంగళగిరి నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేసిన లోకేష్ ఇంటింటికి వెళ్ళారు. అందరినీ పలకరించారు. తాను పాదయాత్రలో ఉన్నా..మంగళగిరి నియోజకవర్గంలో తాను ఉన్నట్టే ఏ ఒక్క కార్యక్రమం ఆగకుండా తన టీముతో పర్యవేక్షించేవారు. పాదయాత్ర అనంతరం మళ్లీ మంగళగిరి నియోజకవర్గం అంతా పర్యటనలతో చుట్టేశారు. ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గంలో 66 రచ్చబండ కార్యక్రమాలకు హాజరు అయ్యారు. 12 అపార్ట్మెంట్ మీటింగ్స్ లో పాల్గొన్నారు. వారి సమస్యలు తెలుసుకుని, అవి ఎంతవరకూ పరిష్కరించగలమో చర్చించారు. లోకేష్ నిజాయితీ, నిబద్ధత చూసిన అపార్ట్ మెంట్ వాసులు పోలింగ్ బూత్ లకు పోటెత్తారు. మంగళగిరి నియోజకవర్గానికి తమ విశేష సేవలు అందిస్తున్న వివిధరంగాల ప్రముఖులను, తటస్థులను నేరుగా వారి ఇళ్లకే వెళ్లి కలిశారు. మంగళగిరి సర్వతోముఖాభివృద్ధికి తన ప్రణాళికలు వివరించి మద్దతు కూడగట్టారు. అన్నివర్గాలకు చేరువై అందరి వాడైన మన లోకేష్ అని నినదించింది మంగళగిరి.
మంగళగిరి సంక్షేమ సారధి నారా లోకేష్
– కష్టమొస్తే ఆదుకునేది లోకేష్..సమస్య అయితే పరిష్కరించేది లోకేష్
– 29 సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు చేరువైన యువనేత
సాటి మనిషికి సాయం చేయాలంటే ఎమ్మెల్యే కానక్కర్లేదని, ప్రజల సమస్యలను ప్రభుత్వాలే పరిష్కరించాల్సిన పనిలేదని నిరూపించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో ఐదేళ్లుగా ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. సమస్య ఏదైనా, పరిష్కారాన్ని చూపుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ నారా లోకేష్ సాయమో, పలకరింపో, కానుకో అందుతుందంటే ఆశ్చర్యపోనవసరంలేదు. సొంత నిధులు, దాతల సహకారంతో 29 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు లోకేష్ చేరువయ్యారు.నూతన వధూవరులకు పెళ్ళి కానుక, మంగళగిరి,తాడేపల్లి లలో అన్నా క్యాంటీన్లు, చిరు వ్యాపారులకు టిఫిన్ , తోపుడు బండ్లు, స్త్రీ శక్తి పేరుతో మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ, సంజీవని ఆరోగ్యకేంద్రాలు / సంజీవని ఆరోగ్యరధం ద్వారా ప్రజలకు ఉచిత వైద్యసేవలు, యువ పేరుతో నిరుద్యోగులకు సాఫ్ట్వే ర్ కోర్సు లలో ఉచిత శిక్షణ, జలధార పేరుతో టాంకర్లద్వారా మంచినీరు సరఫరా, వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, నారా లోకేష్ క్రీడా ప్రాంగణాల నిర్వహణ, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, రజకులకు ఇస్త్రీ బండ్లు, లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంక్షేమ సంఘం ద్వారా సేవలు, పురోహితులకు, పాస్టర్లకు, ఇమామ్ -మౌజన్ లకు పండుగ కానుకలు, నియోజకవర్గంలో గ్రావెల్ రోడ్లు, రోడ్ల మరమ్మత్తులు, నాయి బ్రాహ్మణులకు సెలూన్ చైర్లు, కార్మికులకు వెల్డింగ్ మెషీన్లు, కోవిడ్ సమయంలో వైద్య సహాయం, టిడిపి కార్యకర్తలకు ఆర్థిక సహాయాలు, ఆర్ఎంపీలకు వైద్య సేవ పరికరాలు, వేసవిలో మజ్జిగ పంపిణీ కేంద్రాలు, క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ, యస్సీ వరుని వివాహానికి తాళిబొట్టు, సోదరీమణులకు రాఖీ కానుక, చేనేతలకు రాట్నాల పంపిణీ, నిరుపేదలు మృతి చెందితే వారి కుటుంబాలకు మట్టి ఖర్చులు, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు నిత్యావసరాల పంపిణీ వంటి సహాయాలు ప్రజలకు అందించి నిస్వార్థంగా సేవలు అందించారు లోకేష్. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే ఒక నియోజకవర్గంలో ఇన్ని సంక్షేమ పథకాలు సొంత నిధులతో అందించిన నేతలు లేరు.
లోకేష్ విజయంలోనూ సగం బ్రాహ్మణి
-భర్త గెలుపు కోసం మంగళగిరి నియోజకవర్గంలో విస్తృత ప్రచారం
మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. హెరిటేజ్ వ్యవహారాలలో క్షణం తీరిక లేకుండా గడిపే బ్రాహ్మణి, వారం రోజులపాటు మండుటెండల్లో ప్రజలను కలిసి తన భర్తని గెలిపించాలని కోరారు.
నియోజకవర్గం పరిధిలో డ్వాక్రాసంఘాలు, స్త్రీశక్తి గ్రూపులతో 5 సమావేశాలు నిర్వహించారు. మహిళల సాధికారతకు టిడిపి ఎంతో కృషి చేసిందని, లోకేష్ స్త్రీ శక్తి ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నారని వారికి వివరించారు. యర్రబాలెం సంధ్య చిల్లీ పౌడర్ ఫ్యాక్టరీ, పచ్చళ్ల ఫ్యాక్టరీ, కూరగాయల మార్కెట్, విజయ పచ్చళ్ల ఫ్యాక్టరీ, పసుపు తయారీ కేంద్రం, ట్విల్స్ వస్త్రాల తయారీ యూనిట్, తాడేపల్లిలో చేపలు అమ్మే మహిళలు, బేతపూడిలో మల్లెపూలు ఏరే మహిళలతో మాట్లాడి లోకేష్ ని గెలిపించాల్సిన అవసరాన్ని వివరించారు.
ఎకో పార్కుని సందర్శించి వాకర్స్ తో మాట్లాడారు. నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులతో వాలీ బాల్ ఆడారు. పై కేర్ సాఫ్ట్ వేర్ కంపెనీని సందర్శించి ఉద్యోగులతో కంపెనీలు రావాల్సిన అవసరం ఉందని, టిడిపి వల్లే అది సాధ్యమని వివరించారు. అపార్ట్ మెంటు వాసులతోనూ, వివిధ వర్గాలతో సమావేశమై లోకేష్ గెలుపుతోనే మంగళగిరి అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు. మంగళగిరి పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. మంగళగిరి చేనేతకు మహర్దశ తీసుకొస్తానని తన భర్త నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు బ్రాహ్మణి విశేష కృషి చేశారు. మంగళగిరి చేనేత వస్త్రాలకు మంచి ధర రావడంతోపాటు జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పించేందుకు, చేనేత కళాకారులకు ఆర్థికంగా ఉపయోగపడే ప్రణాళిక సిద్ధం చేశారు. టాటా వారితో మాట్లాడి వారి అనుబంధ సంస్థ తనేరియా సహకారంతో మంగళగిరిలో వీవర్ శాల ఏర్పాటు చేయడంలో బ్రాహ్మణిదే కీ రోల్. నారా లోకేష్ ఎమ్మెల్యేగా తొలిసారి అత్యధిక మెజారిటీతో విజయం సాధించేందుకు భార్య బ్రాహ్మణి ప్రచారం, కృషి ఎంతో దోహదపడింది.
యువగళం లోకేష్ విజయ శంఖారావం
– ఓ వైపు తన మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం
– ఇంకో వైపు రాష్ట్రవ్యాప్తంగా యువగళం సభల నిర్వహణ
తెలుగుదేశం పార్టీ నాయకుల కర్మాగారం అని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తరచూ అంటుంటారు. తనయుడు నారా లోకేష్ కూడా టిడిపి కర్మాగారంలో తయారైన నాయకుడే. మేలిమి నాయకత్వ లక్షణాలతో 2024 ఎన్నికల్లో విజయ శంఖారావం మోగించాడు. 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2100 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లోకేష్, వెనువెంటనే పాదయాత్ర కవర్ చేయని జిల్లాల్లో `శంఖారావం` పేరుతో సభలు నిర్వహించారు. ఓ వైపు తాను పోటీచేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా యువగళం సభలు నిర్వహించారు. నెల్లూరు, రాజంపేట, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, ఏలూరులో యువగళం సభలు జరిగాయి. యువగళం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన ‘హలో లోకేశ్’ తరహాలో యువతతో ముఖాముఖి లోకేష్ మాట్లాడారు. యువతకు ఉద్యోగ-ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తామో వివరించి కొత్త ఓటర్లు, యువత మద్దతు కూడగట్టడంలో విజయవంతమయ్యారు. రాష్ట్రంలో కూటమి ఎన్నికల ప్రచార సభలకు ప్రధాని, ప్రముఖుల రాక సందర్భంగా వాటి ఏర్పాట్ల బాధ్యతలు చూస్తూనే.. ఆ సభలకు టిడిపి ప్రతినిధిగా హాజరయ్యారు లోకేష్. తమిళనాడులోనూ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి తరఫున లోకేష్ ప్రచారం చేశారు. అలుపెరుగని ప్రచారం, రాష్ట్రమంతా వాయువేగం పర్యటనలతో యువత నుంచి కూటమికి మద్దతు కూడగట్టారు లోకేష్. యువగళం వినిపించిన లోకేష్…కూటమి విజయంలో కీలకపాత్ర పోషిస్తూ విజయశంఖారావం పూరించారు.
మంగళగిరికి తొలి యువ ఎమ్మెల్యే నారా లోకేష్
– 72 ఏళ్ల నియోజకవర్గ చరిత్రలో యంగ్ ఎమ్మెల్యే లోకేష్
మంగళగిరి నియోజకవర్గం ఏర్పడిన నుంచీ ఇప్పటివరకూ ఎన్నికైన ఎమ్మెల్యేలలో అతి పిన్న వయస్కుడు నారా లోకేష్. 1952లో ఏర్పడిన మంగళగిరి నియోజకవర్గం నుంచి 11 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 12వ ఎమ్మెల్యేగా ఎన్నికైన లోకేష్ వయస్సు 41 సంవత్సరాలు. 1952 నుంచి 2024 వరకూ 16 సార్లు ఎన్నికలు జరగ్గా, కొందరు రెండు సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ లెక్కన నారా లోకేష్ తో 12 మంది ఎమ్మెల్యేలుగా పనిచేయగా, అత్యంత చిన్న వయస్సు వాడిగా నారా లోకేష్ మరో రికార్డు నెలకొల్పారు.
నాయుడు కొడుకు…నాయకుడై నడిపించాడు
– ఐదుకోట్ల మంది గొంతుక వినిపించిన యువగళం నారా లోకేష్
– లోకేష్ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం
– 3 ప్రాంతాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు గెలుపు
– 2024 ఎన్నికల్లో కూటమిగా అద్భుత విజయం వెనుక లోకేష్ పాత్ర
వైసీపీ అరాచకపాలనలో మూగబోయిన జనస్వరాన్ని చైతన్యపరిచి వినిపించేందుకు యువగళం పాదయాత్రని 2023 జనవరి 27వతేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి ఆలయం నుంచి ఆరంభించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా ముందుకు సాగింది పాదయాత్ర. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,104 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర సాగింది. ఇప్పటివరకూ సాగిన రాజకీయ నేతల పాదయాత్రలకు విభిన్నమైంది లోకేష్ యువగళం పాదయాత్ర. అడుగులు వేసుకుంటూ వెళ్లిపోవడం కాదు, సమస్యలు ప్రత్యక్ష పరిశీలన, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, సత్వర సాయం, మేథోమధనం, అన్నివర్గాల ఆకాంక్షలు తెలుసుకున్న ఓ రాజకీయ యువపరిశోధకుడు సాగించిన మహా ప్రయాణం ఇది. యువగళం పాదయాత్రలో 70 బహిరంగసభలు, 155 ముఖాముఖి, 8రచ్చబండ, 12 ప్రత్యేక కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొని వివిధ వర్గాలు, ప్రాంతాల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు 4,353 వినతిపత్రాలు అందించారు. పాదయాత్రలో 1 కోటి 50 లక్షల మందితో మమేకయ్యారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజాచైతన్యాన్ని మేల్కొలిపారు. అధికారం అండతో వైసీపీ సాగిస్తున్న అణచివేత, అవినీతి, అరాచక పాలనపై ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో 3 పట్టభద్రుల నియోజకవర్గాల్లో టిడిపి మద్దతుతో పోటీచేసిన అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. యువగళం పాదయాత్రతో ప్రజలకు భరోసా, తెలుగుదేశం పార్టీలో నూతనోత్తేజం నింపారు లోకేష్. 2024 ఎన్నికల్లో కూటమి ఘనవిజయానికి యువగళం పాదయాత్ర కూడా దోహదం చేసింది.
నారా లోకేష్ లుక్ క్లాస్..స్పీచ్ ఊర మాస్
– లోకేష్ మాట తీరు, మనిషి రూపం మారిపోయింది
– కరోనా ఆంక్షల సమయంలో డైట్, వర్కవుట్స్ తో న్యూ లుక్
– విమర్శల్ని సలహాలుగా స్వీకరించి తనను తాను తీర్చిదిద్దుకున్న మిస్టర్ పర్ఫెక్ట్ లోకేష్
కరోనా ఆంక్షలు ముగిశాక చాలా రోజుల తరువాత కనిపించిన నారా లోకేష్ న్యూ లుక్ చూసి టిడిపి నేతలు ఆశ్చర్యపోయారు. లావుగా..నున్నగా షేవ్ చేసిన లోకేష్ ని చాలా రోజులుగా చూసిన జనం లైటుగా గెడ్డం, సన్నని మీసకట్టు, స్లిమ్ అయి అద్దిరిపోయే లుక్ తో లోకేష్ కనిపించాడు. నారా లోకేష్ ని ట్రోల్ చేసేందుకు వందల కోట్లు వెచ్చించి ఏళ్లుగా టీములను రన్ చేసిన వైసీపీ సర్జరీ చేయించుకున్నాడని పుకార్లు లేపింది. ఫేక్ పోస్టులు వేసింది. టిడిపి లీడర్లు, మీడియా మిత్రులు ఉండబట్టలేక నారా లోకేష్ 2.o రహస్యం ఏంటని అడిగేశారు. డైట్, వర్కవుట్స్ గురించి వివరించాడు. కరోనా కాలంలో ఇంట్లో ఉంటూ యాప్ వేసుకుని చేసిన వర్కవుట్స్, వాడిన డైట్ వెల్లడించాడు. తూటాల్లాంటి మాటలు, అనర్ఘళంగా తెలుగు మాట్లాడటం.. స్పీచులో సైటైర్లు పెరిగాయి. మీడియా సమావేశాల్లోనూ సాక్షి, టీవీ9, ఎన్టీవీ వాళ్లు వచ్చారా అని అడగటం.. వచ్చారని చెబితే పిలిచి మరీ `ఏం మిత్రమా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీ వాడిలా నేను పారిపోను` అంటూ ర్యాగింగ్ కూడా ఆరంభించాడు లోకేష్. బొద్దుగా ఉన్నారని విమర్శలు వస్తే, వాటిని పాజిటివ్ గా తీసుకుని వర్కవుట్స్ తో ముద్దుగా మారిపోయాడు. మాట్లాడేటప్పుడు తడబడుతున్నారని ట్రోల్ చేస్తే.. యెస్ నా చదువు మొత్తం ఇంగ్లీషు మీడియంలోనే సాగింది, తెలుగులో మాట్లాడేటప్పుడు ఒక పదం అటు ఇటు అవ్వొచ్చంటూనే…అనర్ఘళంగా తెలుగు మాట్లాడుతున్న లోకేష్ ని చూసి ఆశ్చర్యపోవడం వైసీపీ పేటీఎం బ్యాచుల వంతయ్యింది. శిలా తానే, శిల్పీ తానే అయి అద్భుత శిల్పంగా తనను తాను మార్చుకున్న నారా లోకేష్ లుక్ క్లాస్, స్పీచ్ ఊర మాస్ అంటున్నారు జనాలు.
నరేంద్ర మోదీ మెచ్చిన నారా లోకేష్
– ప్రధాని సభల విజయవంతంతో లోకేష్ పై మోదీ ప్రశంసలు
– ప్రధాని మోదీ పక్కనే టిడిపి యువనేత లోకేష్ కి స్థానం
– అమిత్ షాతో భేటీ…ఏపీలో వైసీపీ అరాచకాల వివరణ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ టిడిపి ప్రతిపక్షంలో ఉన్న సంక్షోభ సమయంలో తన నాయకత్వ పటిమను ప్రదర్శించి కేంద్ర పెద్దలతో శెహభాష్ అనిపించుకున్నారు. టిడిపి, జనసేన అలయెన్స్ కుదర్చడం..అనంతరం ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడం వెనుక లోకేష్ రాజనీతిజ్ఞత బయటపడింది. టిడిపి,బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడ్డాక.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి లోకేష్ సభలలో పాల్గొన్నారు. ఏపీలో పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించారు. ప్రధాని పాల్గొన్న సభలు విజయవంతం కావడానికి తెరవెనుక కీలకంగా వ్యవహరించిన నారా లోకేష్ ని నరేంద్ర మోదీ అభినందించారు. వేదికపై తన పక్కనే నారా లోకేష్ కి స్థానం ఇచ్చారు. ప్రధానికి స్వాగతం పలికేటప్పుడు తన మంగళగిరి నియోజకవర్గం గొప్పతనాన్ని, బీసీలైన పద్మశాలీయుల కృషి-సృజనాత్మక కళను మోదీ దృష్టికి తీసుకెళ్లడంలో గొప్ప పరిణతి ప్రదర్శించారు నారా లోకేష్. వయస్సులో చిన్నవాడైనా, పెద్దల్ని గౌరవించడంలో మాత్రం ఉన్నతంగా నిలిచాడు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు, సభలు విజయవంతం చేయడంతో దేశవ్యాప్తంగా లోకేష్ పేరు మారుమోగింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు పోటీచేసిన పార్లమెంటు స్థానం పరిధిలో తెలుగువారున్న ప్రాంతాల్లో నారా లోకేష్ ని ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారానికి బీజేపీ తీసుకెళ్లడం లోకేష్ పట్ల వారికున్న నమ్మకానికి నిదర్శనం.
లోకేష్ కి దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్
– చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు లోకేష్ కి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
– జనసేన అధ్యక్షుడిని దేవుడిచ్చిన అన్నయ్యగా భావించి గౌరవించిన లోకేష్
ఉరుముకి మెరుపు తోడైతే ప్రళయగర్జనలే. ఇరుపార్టీలకు చెందిన ఇద్దరు యువ అగ్రనేతలు చేయి కలిపితే అది జన ప్రభంజనమే అవుతుంది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడిని అక్రమకేసులో అరెస్టు చేయించింది వైసీపీ సర్కారు. యువగళం పాదయాత్రలో ఉన్న తనయుడు నారా లోకేష్ తన తండ్రి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఏపీకి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ ని అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. చంద్రబాబు అక్రమ అరెస్టుని ఖండిస్తూ, నారా లోకేష్ న్యాయపోరాటానికి తాను అండగా నిలుస్తున్నట్టు ప్రకటించారు పవన్. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చేవరకూ మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ తనకు దేవుడిచ్చిన అన్నయ్య అని నారా లోకేష్ ప్రస్తావించడం గమనార్హం. వైకాపా అరాచక పాలన అంతమే తన పంతమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మాట ఇచ్చిన జనసేనాని, రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని బీజేపీతోనూ పొత్తు కుదిర్చారు. పవన్, లోకేష్ లు ఇద్దరూ ఇరుపార్టీల అగ్రనేతలుగా కాకుండా… కుటుంబం అనే రాష్ట్రంని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా, ఎంతటి పోరాటానికైనా రెడీ అంటూ రంగంలోకి దిగిన సొంత అన్నదమ్ముల్లాగే పనిచేశారు. అభ్యర్థుల ఎంపికలోనూ, సభల నిర్వహణలోనూ, మేనిఫెస్టో ప్రకటనలోనూ ఉమ్మడి కార్యాచరణ స్పష్టంగా కనపడింది. యువనేతల మధ్య సమన్వయం..పరస్పర గౌరవ భావం, సోదరబంధం రాష్ట్రానికి మంచి రోజులు తెచ్చాయి.