నారా కుటుంబం తాజాగా గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంగళగిరి పానకాల స్వామి ఆలయంలో పర్యటించింది. నారా భువనేశ్వరి, నారా లోకేష్ , ఆయన సతీమణి బ్రాహ్మణి, వీరి కుమారుడు నారా దేవాన్ష్‌లు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. పేదలకు అన్నదానంచేయడంతోపాటు.. వస్త్రదానం కూడా చేశారు. అదేవిధంగా చెంచు లక్ష్మి అమ్మవారికి బంగారు కిరీటం కూడా కానుకగా సమర్పించారు. ఇక, ఆలయంలోని ఎగువ, దిగువ సన్నిధానాల్లోనూ పూజలు చేశారు. కుటుంబ సమేతంగా స్వామికి ప్రత్యేక కల్యాణం కూడా చేయించారు.
చివరగా.. నారా కుటుంబం స్వామి వారికి మెట్ల పూజ చేసింది. ప్రతిమెట్టుకు పసుపు రాసి.. దీపం పెట్టి.. పూలు జల్లి అర్చన చేసింది. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి పసుపు రాయగా, నారా లోకేష్ పూజలు జల్లగా, బ్రాహ్మణి దీపం వెలిగించారు. అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారికి రూ.20 లక్షల విలువ చేసే కంఠాభరణాన్ని కానుకగా అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా లోకేష్ చిత్రపటాలతో కూడిన బ్యానర్లు కట్టారు.
సెంటిమెంటు ఇదీ..
గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచే పోటీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇక్కడి మండలాల్లో పర్యటించారు. అయితే.. నియోజకవర్గంలోని లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు సహా మెట్ల పూజలు చేస్తే.. గెలుపు తథ్యమని కొందరు పండితులు సూచించడంతో.. నారా లోకేష్ గత ఎన్నికలకు ముందు కూడా ఈ పూజలకు ప్లాన్ చేసుకున్నారు. అయితే..అప్పట్లో సమయాభావం కారణంతో వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత.. ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకుముందు సమయం చూసుకుని..ఇప్పుడు ప్రత్యేక పూజలు, మెట్ల ఆరాధనలు చేయడం గమనార్హం. మరి ఈ సెంటిమెంటు ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.