నోరు విప్పితే రైతుల కోసమే బతుకుతున్నాం అని చెప్పుకునే జగనన్న పాలనలో ఏడాదిన్నరలో రైతు ఏ పంటను చేతికి తీసుకోలేదు. చేతికందిన ముద్ద నోటికందలేదు అన్నట్టు… పొలంలో పంట వేయడమే గాని పంట నూర్పిడిదాకా వచ్చే అవకాశమే లేకుండా పోయింది.
జగనన్న వస్తే వర్షాలు వస్తాయని… ప్రచారం చేస్తే వరదలు వచ్చి రైతులనే కాదు, ఇళ్లను కూడా ముంచెత్తాయి. దీంతో వరుణుడు మా పార్టీ అని చెప్పుకోవడానికి వైసీపీ వణికిపోతోంది.
29వేల మంది రైతులను అడ్డంగా రోడ్డున పడేసిన వైసీపీ సర్కారుకు అసలు తమది రైతుల పార్టీ అని చెప్పుకునే హక్కు ఎక్కడుంది. 29 వేల మంది రైతుల్లో 90 శాతం రైతులు ఎకరాలోపు రైతులే. కానీ కళ్లు మూసుకుని ప్రభుత్వం నడుపుతున్న పెద్దలు వారి పట్ల హీనంగా ప్రవర్తిస్తున్నారు. కేవలం ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా అన్ని ఇతర వ్యవస్థలను నిర్లక్ష్యం చేస్తూ నోట్ల కట్టలు పంచి జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోంది.
ఒకవైపు జగన్ ప్రజలను, రైతులను కలవడానికి భయపడుతుంటే నారా లోకేష్ వరదల్లో కరోనాను కూడా లెక్క చేయకుండా నడుంలోతు నీళ్లలో దిగి రైతుల వెంట నడిచారు. వారి ఇంటికెళ్ల వారి బాధను పంచుకునే ప్రయత్నం చేశారు. మరోసారి తాజాగా రైతుల సమస్యలపై రచ్చబండ నిర్వహించారు ఈరోజు. ఈ సందర్భంగా లోకేష్ ఏమన్నారో చూద్దాం.
‘‘రాష్ట్రంలో రైతులకు సమస్యలు లేవు, రైతులంతా అంతా సంతోషంగా ఉన్నారు అని అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తన భుజాలను తానే తట్టి ‘శభాష్’ అనుకున్నారు.కానీ వాస్తవంలో వరుస తుఫాన్లు,వరదలతో నష్టపోయి సహాయం అందక బ్రతకలేని పరిస్థితిలో ఉన్నామని..కనీసం రైతుభరోసా కూడా అందలేదని రైతులు అంటున్నారు. ఈతేరు గ్రామ రైతులతో ఈరోజు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కౌలు రైతుల్లో ఎక్కువగా ఎస్సీ, బీసీ వారే ఉన్నారు. వారికి కనీసం కౌలుదారు కార్డులు కూడా ఇవ్వలేదు. ఈ-క్రాప్ లో నమోదు చెయ్యడం లేదు. దీనికి తోడు తమపై మీటర్ల భారం వేయాలని చూస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.