మంగళగిరి చేనేత కార్మికుల జీవితాల్లో నవశకం ప్రారంభం అయింది. అయిదు శతాబ్దాల చరిత్ర కలిగిన మంగళగిరి చేనేత రంగం ఇప్పుడు ఆధునాతన రాట్నం వాడకాన్ని ప్రారంభించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఫలితంగా చేనేత కార్మికులకు శ్రమ సగానికి సగం తగ్గటంతో పాటు రెట్టింపు ఆదాయం పొందే అవకాశం లభించింది.
ఇందుకు సామాజిక బాధ్యతతో పలు స్వచ్ఛంద సంస్థలు పలువురు దాతృత్వం ఉన్న వ్యక్తులతో పాటు చేనేత.వర్గానికే చెందిన ముందుచూపు ఉన్న కొందరు నాయకులు పూనుకోవడంతో మంగళగిరి చేనేత కార్మికులు ఆధునాతన రాట్నాలను వాడే అవకాశం లభించింది. ఈ ఆధునాతన రాట్నం వలన కలిగే ప్రయోజనాన్ని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ‘నారా లోకేష్’ కూడా స్వచ్చందంగా సహకారం అందించేందుకు ముందుకు రావడంతో ఇకపై మంగళగిరి చేనేత కార్మికులందరూ వీటినే వినియోగించే స్తోమత లభించింది.
వివరాల్లోకి వెళితే మంగళగిరి చేనేత రంగానికి సుమారుగా అయిదు శతాబ్దాల ప్రాచీనమైన ఘన చరిత్ర ఉంది. చేనేత వస్త్రాలను నేయటమే (తయారీ) కుటుంబ పోషణకు వృత్తిగా ఇక్కడి పద్మశాలి కుటుంబాలు ఎంచుకున్నారు. పిల్లలు మొదలు మహిళలు మరియు వృద్దులతో పాటు కుటుంబ సభ్యులంతా రాట్నం లేదా మగ్గంతో కలిసి జీవించటం వీరి నిత్య దైనందిన జీవనంలో భాగమైంది.. గతంలో 15,000 మగ్గాలు అంటే దాదాపు 40,000వేల మంది చేనేత రంగంపై ఆధారపడి జీవించేవారు. ఇప్పుడు ఆ మాగ్గాలసంఖ్య దాదాపు 2400కు పడిపోయింది. నేడు ఈ వృత్తి కార్మికులకు కడుపునింపని కళగా మారింది. పైగా శతాబ్దాల క్రితం నాటి పద్దతులు మగ్గాలు వాడటానికి అలవాటు పడటంతో చేనేత కార్మికులు ఎంతో శ్రమతో కష్టాలు పడుతున్నారు.
ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశంపార్టీ రాష్ట్ర చేనేత సంఘం నాయకుడు గుత్తికొండ ధనుంజయరావుతో పాటు మరికొందరు చేనేత కార్మికులు స్థానికంగా ఉన్న ఎన్ఆర్ఐలను కలిసి సహాయం కోరారు. దీంతో వారు తమకు తోచిన సాయం చేయడంతో పాటుbచేనేత కార్మికుల కష్టాలను పలు స్వచ్ఛంద సంస్థల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన టాటా సంస్థ ఆధునాతన రాట్నం వాడకాన్ని సూచించింది. దీనివలన కార్మికులకు శ్రమ తగ్గడంతో పాటు ఆదాయం పెరిగే మార్గం లభించింది.
ఈ ఆధునాతన రాట్నం సైకిల్ చైన్ సహాయంతో పని చేస్తుంది. గతంలో పాతకాలపు రాట్నం దారపు ఆధారంగా పని చేయాల్సి వచ్చేది. గతంలో రోజుకు 8 లడ్డీలు (దారపు పోగుల కండెలు) చుట్టగలిగేవారు.ఇప్పుడు సులభంగా 15 లడ్డీలు చుట్టగలుగుతున్నారు. ముఖ్యంగా ఇంట్లోనే మహిళలు చేసే ఈ పని వలన వారి రోజూ వారి ఆదాయం రూ 80 నుంచి రూ 140 పెరిగింది. అదే విధంగా పాత పద్ధతి రాట్నంతో గతంలో భుజం నొప్పి అనిపించేదని మహిళా కార్మికురాలు తాటి వెంకట సుబ్బమ్మ చెప్పారు.
ఇటీవలే నాలుగువేల రూపాయల ఖరీదైన సైకిల్ చైన్ సహాయంతో పని చేసే రాట్నాన్ని ఉచితంగా పొందిన మహిళా కార్మికురాలు జొన్నాదుల సామ్రాజ్యం సంతోషం వ్యక్తం చేశారు.తెలుగుదేశంపార్టీ చేనేత విభాగం రాష్ట్ర నాయకుడు గుత్తికొండ ధనుంజయరావు సాయంతో రాట్నం పొందినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాటా ట్రస్ట్ వారు సూచించిన రాట్నంకు స్థానికంగా చిన్నపాటి మార్పులతో కార్మికులకు ఉపయోగపడేలా డిజైన్ చేసినట్లు తెలిపారు. మరోవైపు తాము ఈ రాట్నం పనితీరు ఉపయోగాన్ని అనేక మంది దృష్టికి తీసుకెళ్లామని కానీ వారిలో నారా లోకేష్ గారు స్పందించి అవసరమైన కార్మికులందరికీ అందేలా చూస్తే తాను సాయం చేస్తానని ముందుకు వచ్చారని తెలిపారు. అవసరమైన కార్మికులు ముందుకు వచ్చి తమను సంప్రదిస్తే రాట్నాలు ఉచితంగా అందిస్తామని ధనుంజయరావు తెలిపారు. ఇందుకు ఎన్ఆర్ఐ కిలారు సునీల్ కూడా ప్రాధమికంగా ఒకడుగు ముందుకు వేసి తన వంతు సాయం చేసి ఆధునాతన రాట్నాలను చేనేత కార్మికులకు అందచేస్తానని హామీ ఇచ్చారు.