టీడీపీ నేత పట్టాభి ఇంటితో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయం, రాష్ట్రంలోని పలు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడి వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. అయితే, దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయని పోలీసులు…లోకేశ్ తో పాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో జగన్ నిజంగానే సైకో రెడ్డి అనిపించుకున్నారని లోకేశ్ షాకింగ్ కామెంట్లు చేశారు. పెంపుడు కుక్కలను తమపైకి పంపి తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ దాక్కున్నారని ఎద్దేవా చేశారు. నేరుగా వస్తే మాట్లాడదామని, పోరాడదామని జగన్ కు లోకేశ్ సవాల్ విసిరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగిపోయిందని లోకేశ్ ఆరోపించారు.
నడి వీధిలో చంద్రబాబును కాల్చి చంపాలని గతంలో జగన్ వ్యాఖ్యానించారని, చంద్రబాబును బంగాళాఖాతంలో కలపాలని జగన్ అన్నారని లోకేశ్ గుర్తు చేశారు. ముఖ్యకంత్రిని జైల్లో పెట్టి తన్నాలి అని చంద్రబాబునుద్దేశించి గతంలో జగన్ అనలేదా? అని ప్రశ్నించారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని, అధికారంలో వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు. కొందరు పోలీస్ అధికారుల తీరువల్ల మొత్తం పోలీసులకు చెడ్డ పేరు వస్తోందన్నారు.
టీడీపీ కార్యాలయంపై దాడి జరిగి 24 గంటలు గడిచినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని లోకేశ్ ఆరోపించారు. వైసీపీ నేతలు దాడి చేసినప్పుడు రికార్డైన సీసీ ఫుటేజ్‌ను డీజీపీకి అందజేసినా ఇప్పటివరకూ నిందితులను అరెస్ట్ చేయకపోవడం శోచనీయమన్నారు. సజ్జల ఒక బ్రోకర్ అని, ఆయన వ్యాఖ్యలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. బోసడీకే అనే పదం తప్పుకాదని పట్టాభి వ్యాఖ్యలను లోకేశ్ సమర్థించారు. పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు.