టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, వైసీపీ నేత, సీనియర్ పొలిటిషియన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుల గురించి తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఇద్దరు అల్లుళ్లుగానే కాకుండా…రాజకీయాల్లో తమకంటూ వీరిద్దరూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. అయితే, రాజకీయాలపరంగా ఈ తోడల్లుళ్లిద్దరి మధ్యా కాస్త వైరుధ్యం ఉండడంతో…మీడియాలో వీరిద్దరూ ఒక ఫ్రేమ్ లో కనిపించడం అరుదు.
ఇక, నందమూరి కుటుంబంలో జరిగే శుభకార్యాలకు వీరిద్దరూ హాజరైనా…ఒకేసారి కలిసి ఫొటో దిగడం చాలా అరుదుగా జరుగుతంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి తనయురాలి పెళ్లి వేడుక సందర్భంగా ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. అటు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇటు నారా భువనేశ్వరి, పురంధేశ్వరి పక్కపక్కనే నిల్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు. పెళ్లికూతురుకు నలుగు పెట్టే కార్యక్రమంలో ఈ తోడల్లుళ్లు సందడి చేశారు.
దీంతో, ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక, ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ దంపతులు, నందమూరి వారసులు హాజరై సందడి చేశారు. ఈ ఫొటో చూసిన తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు రాజకీయాలేనని, బంధుత్వం బంధుత్వమేనని అంటున్నారు.