హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కొలువైన పెద్దమ్మతల్లికి కోట్లాది మంది భక్తులున్న సంగతి తెలిసిందే. పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసేందుకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు వస్తుంటారు. ముఖ్యంగా దసరా వంటి పండుగల సందర్భంగా పెద్దమ్మ తల్లి గుడికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తమకు విజయాలు కలగాలని, తాము కోరిన కోర్కెలు తీర్చాలని భక్తులు కోరుతుంటారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు కోడలు, మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి పెద్దమ్మ గుడిలో ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు.
ఇక, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని టీమిండియా క్రికెటర్లు కూడా దర్శించుకున్నారు. బంగ్లాదేశ్తో టీ20 మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు సభ్యులు తిలక్ వర్మ, నితిశ్ కుమార్ రెడ్డి పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ఈ ఇద్దరు ప్రత్యేక పూజలు చేయించారు. ఈ రోజు సాయంత్రం బంగ్లాతో భారత్ మూడో టీ20 మ్యాచ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది.
ఇక, దసరా సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనం కోసం వేలాదిమంది తరలి వస్తున్నారు. భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఈ రోజు పెద్దమ్మతల్లి ఆలయంలో వాహన పూజ కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వందలాది మంది భక్తులు తమ వాహనాలను గుడికి తీసుకువచ్చారు. నేటితో దేశంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.