టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించేందుకు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలువురు నేతలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలలో గాని, మీడియా ముందుకు గాని పెద్దగా రాని నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి లు ప్రజల మధ్యకు వచ్చారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజమండ్రిలో మహిళలు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో బ్రాహ్మణి, భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై బ్రాహ్మణి తొలిసారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. యువతకు నైపుణ్యం నేర్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, ప్రస్తుతం జగన్ ప్రభుత్వం యువతకు గంజాయి, లిక్కర్ తప్ప ఏమీ ఇవ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వంటి నాయకుడిని, విజనరీ లీడర్ ను అకారణంగా అరెస్టు చేశారని బ్రాహ్మణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం కక్ష సాధింపుతోనే ఆధారాలు లేకున్నా అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. యువతకు శిక్షణ ఇచ్చి సంక్షేమం దిశగా వారిని నడిపించడమే చంద్రబాబు చేసిన నేరమా అని ఆమె ప్రశ్నించారు. యువతీయువకులకు ఉద్యోగాలు ఇప్పించడమే చంద్రబాబు చేసిన పాపమా అని ఆవేదన వ్యక్తం చేశారు. రేపో మాపో లోకేష్ ని కూడా అరెస్ట్ చేస్తారేమో అని బ్రాహ్మణి షాకింగ్ కామెంట్స్ చేశారు.
8 ఏళ్ల వయసున్న దేవాన్ష్ కు కూడా చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ లో ఏమీ లేదన్న సంగతి తెలుసని అన్నారు. తాము ఒంటరి వాళ్లం కాదని, తమ వెనుక తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు కలిపి ఒక కుటుంబం మొత్తం ఉందని అన్నారు. పాదయాత్ర తన కార్యక్రమం కాదని, అది లోకేష్ కార్యక్రమం అని బ్రాహ్మణి చెప్పారు.