టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 2024 ఎన్నికలకు ముందు టీడీపీ తరఫున తన వంతు ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. గతంలో ఏనాడూ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాని భువనేశ్వరి…చంద్రబాబు అరెస్టు తర్వాత ఇంటి గడప దాటి బయటకు రావాల్సి వచ్చింది. 2023 సెప్టెంబరు నెలలో చంద్రబాబు అరెస్టు మొదలు జూన్ నెలలో ఎన్నికల ఫలితాలు వెలువడే దాకా భువనేశ్వరి గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడికి గురయ్యారు. రాష్ట్రాభివృద్ధి కోసం కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయాన్ని సైతం రాష్ట్రం కోసం వెచ్చిస్తూ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడ్డ తన భర్త చంద్రబాబును అరెస్టులు, కక్ష సాధింపులతో వేధించడంపై తీవ్రంగా కలత చెందారు.
అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటూ రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో తీర్పునివ్వడంతో భువనేశ్వరి, నారా, నందమూరి కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజల కష్టాలు తీరిపోయాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సందర్భంలో భువనేశ్వరి ఎమోషనల్ అయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలి సంతకం చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆసక్తికర కామెంట్లు చేశారు.
‘‘ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నాలో సగం, నా ప్రాణం నారా చంద్రబాబునాయుడు గారు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు చేసిన తొలి సంతకం… రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమానికి సంకేతం…ఇచ్చిన హామీ మేరకు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నా’’ అంటూ భువనేశ్వరి చేసి ఎమోషనల్ ట్వీట్ వైరల్ గా మారింది.