టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర గురించి నారా భువనేశ్వరి స్పందించారు. ఈ రోజు కుప్పంలో పర్యటించిన ఆమె…వైసీపీ దారుణాలపై నోరు విప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా భువనేశ్వరి ఎమోషనల్ అయ్యారు. లోకేష్ పాదయాత్ర చేస్తాను అని చెప్పగానే తనకు భయం వేసిందని, అందుకే వద్దని వారించానని గుర్తు చేసుకున్నారు.
అయితే, తనకు ఏదైనా ప్రమాదం జరగాలని రాసి పెట్టి ఉంటే ఇంట్లో ఉన్నా ఆ ప్రమాదం జరుగుతుందని, పాదయాత్ర చేసినా జరుగుతుందని తనతో లోకేష్ చెప్పాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తాను పాదయాత్ర వద్దని చెప్పలేదని, లోకేష్ పాదయాత్ర మొదలుబెట్టాడని అన్నారు. కానీ, పాదయాత్ర మొదలైన కొత్తలో వైసీపీ నేతలు చాలా అడ్డంకులు సృష్టించడంతో తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురయ్యానని భువనేశ్వరి చెప్పారు.
లోకేష్ కు ఏమన్నా అవుతుందేమో అని కంటతడి పెట్టుకునేదాన్నని, కన్నీళ్లు ఆపుకోలేకపోయానని అన్నారు. కానీ, అన్ని అడ్డంకులు అధిగమించి లోకేష్ పాదయాత్ర కొనసాగించాడని, పాదయాత్ర ముందుకు సాగుతున్న కొద్దీ లోకేష్ రాటుదేలాడని ప్రశంసించారు. వైసీపీ నేతలు తమ కుటుంబాన్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. అయితే, వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కోసం, ప్రజల సంక్షేమం కోసం తమ కుటుంబం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుందని భువనేశ్వరి భావోద్వేగంతో చెప్పారు.
ఇక, తన తండ్రి ఎన్టీఆర్ పేరిట రూ.100 స్మారక నాణెం విడుదల చేయడం, ఆ కార్యక్రమానికి తమ కుటుంబ సభ్యులంతా హాజరు కావడం ఎనలేని సంతోషాన్నిచ్చిందని చెప్పారు. నాన్నగారి స్మారక నాణెం కోసం అక్క పురందేశ్వరి చాలా కృషి చేసిందని, ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. కుప్పంలో ఎన్టీఆర్ సంజీవిని ఉచిత వైద్యశాలను ప్రారంభించిన సందర్భంగా భువనేశ్వరి పై వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.