టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఘటనపై భువనేశ్వరి తొలిసారిగా స్పందించినట్లు తెలుస్తోంది. ‘దిగజారిన మనుషులు మాట్లాడిన మాటలన్నీ మనసులో పెట్టుకోవద్దని, వాటిని వదిలేయాలని చంద్రబాబును భువనేశ్వరి సముదాంయించినట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లో ఒక్కోసారి ఇటువంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని, గతంలో ఎన్టీ రామారావుగారిని ఉద్దేశించి కొందరు ఇలాగే నీచంగా మాట్లాడేవాని భువనేశ్వరి గుర్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తరహా వ్యాఖ్యల వల్ల మనసుకు బాధ కలిగినా వాటిని పట్టించుకోకుండా పక్కకు నెట్టి మన పని మనం చేసుకోవాలని, చంద్రబాబును బాధ పెట్టడానికే ఇలా మాట్లాడుతుంటారని ఆమె అన్నట్లు తెలుస్తోంది.
అంతకుముందు, మీడియా సాక్షిగా చంద్రబాబు కంటతడి పెట్టిన దృశ్యాన్ని టీవీలో చూసిన భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారని తెలుస్తోంది. ఆ సమయంలో హైదరాబాద్ లోని ఇంట్లో ఒక్కరే ఉన్న భువనేశ్వరిని సముదాయించేందుకే చంద్రబాబు, లోకేశ్ శుక్రవారం సాయంత్రం హుటాహుటిన హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంటికి చేరుకున్న తర్వాత వారిద్దరినీ చూసి భువనేశ్వరి మరోసారి విలపించినట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత ఆమె కోలుకొని చంద్రబాబును, లోకేశ్ ను సముదాయించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శనివారం నాడు ఆ ఘటన తాలూకు భావోద్వేగం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు…టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో వరద పరిస్థితి, వరద బాధితులకు, నిరాశ్రయులకు అందుతున్న సాయం గురించి చర్చించారు.