టీడీపీలో ఒకప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బిజీ బిజీగా గడిపేవారు. వయసుతో నిమిత్తం లేకుండా..కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఆయన ప్రజల కోసం నిరంతరం శ్రమించేవారు. క్షణం తీరిక లేకుండా.. చంద్రబాబు బిజీ షెడ్యూల్‌తో వ్యవహరించేవా రు. ప్రజల కోసం.. అంటూ ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కట్ చేస్తే.. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. అయితే.. అక్కడ నుంచి భౌతికంగా బయటకు రాకపోయినా.. మానసికంగా మాత్రం చంద్రబాబు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ప్రజల మధ్యే ఉంటున్నారు.
ఇక, ఇప్పుడు చంద్రబాబు సూచనలు, సలహాల మేరకు ఆయన కుటుంబం యావత్తు ప్రజల మధ్యే ఉంటోంది. ముఖ్యంగా అసలు ప్రజాక్షేత్రం, ఎన్నికలు, రాజకీయం వంటివి ఏమీ తెలియని ఆయన సతీమణి నారా భువనేశ్వరి.. ఇప్పుడు పొలిటికల్‌గా బిజీ అయిపోయారు. నిజం గెలవాలి యాత్ర చేస్తున్న నారా భువనేశ్వరి మంగళవారం నుంచి వరుస షెడ్యూల్‌తో మరింత బిజీ కానున్నారు. వాస్తవానికి గడిచిన మూడు రోజులు ఆమె ఈ యాత్రతో తిరుపతి జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఇక, ఇప్పుడు ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టారు.
మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు నారా భువనేశ్వరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నట్టు టీడీపీ తెలిపింది. మంగళవారం నేరుగా విజయనగరం చేరుకోనున్న భువనేశ్వరి.. అక్కడ రైలు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. అదేవిధంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడంతోపాటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ఇక, బుధవారం, గురువారాల్లోనూ ఆమె నిజం గెలవాలి యాత్రను నిర్వహించనున్నారు. నవంబరు 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో నిజం గెలవాలి యాత్రను నిర్వహిస్తారు. ఇక, 2వ తేదీన ఎచ్చర్లలో ఈయాత్ర నిర్వహించనున్నారు. మొత్తంగా నారా భువనేశ్వరి రాజకీయంగా బిజీకానుండడం గమనార్హం.