అధినేత మీద అంచంచలమైన ప్రేమాభిమానాలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారుతోంది. విషయం ఏదైనా సరే.. సీఎం కంట్లో పడాలన్న తపన అధికారుల్లోనూ.. నేతల్లోనూ ఎక్కువ అవుతోంది. ఇది జగన్ కు కొత్త కష్టంగా మారుతోంది. రాజకీయంగా కొన్ని అంశాల మీద స్పందించే వేళలో..అన్ని కోణాల్ని పరిగణలోకి తీసుకొని వ్యాఖ్యలు చేయాలి. అందుకు భిన్నంగా తొందరపాటుతో చేస్తే.. జరిగే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. తాజాగా జగన్ పార్టీ నేతల తీరు ఇదే తరహాలో ఉంటోంది. వైసీపీ నేతలు నిరంతరం నేత భజనలో తరిస్తున్నారు.
తాజాగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాటలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా ఆయన.. అమరావతి జేఏసీ మీద చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఏడాదికి పైనే ఉద్యమం చేస్తున్నారు. ఇందులో పాల్గొంటున్న వారంతా రైతులు.. మహిళలలే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇదిలా ఉంటే.. అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్లుగా నందిగం సురేష్ నిరాధార ఆరోపణలు చేశారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి భూముల కోసం ఉద్యమిస్తున్నట్లుగా విమర్శిస్తున్నారు. ఇలాంటి విమర్శలు జగన్ కి సంతోషాన్ని కలిగిస్తాయోమో గాని ప్రజలకు కోపాన్ని తెప్పిస్తాయి. రియల్ ఎస్టేట్ ఉద్యమాలు ఎక్కడైనా నెలలు సంవత్సరాలు నడుస్తాయా? అలాంటి ఉద్యమాల్లో ప్రాణాలు పోతాయా? లేదు కదా. ఈ మాత్రం ఆలోచించకుండా మాట్లాడితే జనంలో తీవ్ర వ్యతిరేకత తప్పదు.
పేదవారికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలంటూనే.. అమరావతిలోని 29 గ్రామాల ప్రజల గురించి మాట్లాడే హక్కు విపక్ష నేతకు లేదని మండిపడటంలో అర్థం లేదు. బాబును టార్గెట్ చేస్తే.. ఆయన తీరును తీవ్రంగా తప్పుపట్టాలి. అది వదిలేసి.. అమరావతి గ్రామాల్ని టార్గెట్ చేసినట్లుగా మాట్లాడటంలో అర్థం లేదు. అంతేకాదు.. అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని.. నిజమైన రైతులు.. పేదవారు ఎవరూ దీక్షలు చేయటం లేదన్న తీవ్ర విమర్శ కూడా పార్టీకి.. ప్రభుత్వానికి మేలు బాగా డామేజ్ చేస్తోంది. అమరావతి ప్రాంతంలో అత్యధికులు దళితులు, బీసీలు. మరి అక్కడంతా కమ్మోళ్లే ఉన్నారని అబద్ధం చెబితే జనానికి వాస్తవాలు తెలియదా? జనం గుడ్డిగా వైసీపీ నేతలు చెప్పింది నమ్మేస్తారా?
రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత.. మూడు రాజధానులు ఉండాలన్న విధానపరమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న వేళ.. అలాంటి ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి అన్నట్లుగా ఉండాలి. అందుకు భిన్నంగా దురుసుగా మాట్లాడటం వల్ల ప్రయోజనం కలుగక పోగా.. ఎంపీ సురేష్ లాంటి వారి మాటలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మారతాయి. ఒకవేళ.. ఎంపీ చెప్పిన విషయంలో నిజం ఉంటే.. దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తూ వ్యాఖ్యలు చేయటం సబబుగా ఉంటుంది. అందుకు భిన్నంగాతక్షణ రాజకీయ ప్రయోజనం కోసం చేసే వ్యాఖ్యలు జగన్ సర్కారుకు మేలు కంటే చేటు చేస్తాయన్నది మర్చిపోరాదు.
ఇప్పటికే తేనెతుట్టె వంటి రాజధాని అంశాన్ని కలిపి జగన్ ఇరుకున పడ్డాడు. దానికి ఆజ్యం పోసి పెంచతున్నారు ఇలాంటి వాళ్లు.