గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.
తారక రత్న మృతదేహాన్ని రేపు ఉదయానికి మోకిల లోని తన నివాసానికి తరలిస్తారు.
ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.
సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు.
నందమూరి తారకరత్న మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతి – నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది – తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు – 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న… చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు – తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను : టీడీపీ అధినేత చంద్రబాబు
నందమూరి తారకరత్న మృతికి నారా లోకేశ్ దిగ్బ్రాంతి – బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు – నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగులు చప్పుడు ఆగిపోయింది – నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది – తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
నందమూరి తారకరత్న మృతితో టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకి బ్రేక్ – తారకరత్నకి నివాళులు అర్పించేందుకు రేపు ఉదయం హైదరాబాద్ బయలుదేరనున్న నారా లోకేష్
నందమూరి తారకరత్న మృతిపై సీఎం జగన్ సంతాపం – తారకరత్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జగన్
తారకరత్న మృతి పట్ల సంతాపం తెలిపిన చిరంజీవి – ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోవడం బాధాకరం : చిరంజీవి
తారకరత్న మృతిపట్ల పవన్ కల్యాణ్ సంతాపం – నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకున్నారు – తారకరత్న కన్నుమూయడం బాధాకరం : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
తారకరత్న మృతిపట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంతాపం – తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం – సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం – కాని విధి మరోలా తలచింది : ఎంపీ విజయసాయిరెడ్డి
విలన్‌గా నంది అవార్డు – హీరోగా ఒక్క రోజు 9 సినిమాలకు క్లాప్ కొట్టిన తారకరత్న
నందమూరి తారక రత్న హీరోగా చేసిన సినిమాల సంఖ్య తక్కువే. చేసిన సినిమాల్లో విజయాల శాతం కూడా తక్కువ. అయితే, తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఆయన ప్రవేశం ఓ సంచలనం. తారక రత్న ఎంట్రీ హాట్ టాపిక్ అయ్యింది. నందమూరి తారక రామారావు నట వారసత్వంతో, ఆయన మనవడిగా… మోహనకృష్ణ కుమారుడిగా చిత్రసీమకు వచ్చారు.
ఒక్క రోజే తొమ్మిది సినిమాలు.
ఒక్క రోజు తొమ్మిది సినిమాలకు క్లాప్ కొట్టిన ఘనత నందమూరి తారక రత్నది. ఆ తొమ్మిదింటిలో కొన్ని సెట్స్ మీదకు వెళ్ళాయి. మరికొన్ని ఆ రోజు వార్తకు మాత్రమే పరిమితం అయ్యాయి. అసలు ఆ సినిమాలు ఓపెనింగ్ జరిగే వరకు తారకరత్న ఎలా ఉంటారనేది ప్రేక్షకులు, ఇండస్ట్రీలో కొందరికి తప్ప మిగతా వాళ్ళకు అసలు తెలియదు.
ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో తారకరత్న తొమ్మిది సినిమాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆ రోజు అతడిని చూడటానికి చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు మీడియా కూడా ఆసక్తి కనబరిచింది.
ఒకటో నంబర్ కుర్రాడు’లో పాటలు హిట్టే గానీ.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ భాగస్వామ్యంతో నిర్మించిన ‘ఒకటో నంబర్ కుర్రాడు’ సినిమాతో హీరోగా తారకరత్న టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమాలో పాటలు సూపర్ హిట్. ఇప్పటికీ ‘నెమలీ కన్నోడా…’, ‘నువ్ చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా…’, ‘తొడగొట్టి చెబుతున్నా…’ అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటాయి.
‘ఒకటో నంబర్ కుర్రాడు’ తర్వాత ‘యువరత్న’, ‘తారక్’, ‘భద్రాద్రి రాముడు’ తదితర సినిమాల్లో హీరోగా నటించారు. అయితే, ఆయనకు ఎక్కువ విజయాలు రాలేదు. కానీ, ఆయన సినిమాల్లో పాటలు కొన్ని సూపర్ హిట్ అయ్యాయి.
ప్రతినాయకుడిగా నంది
హీరోగా వరుస వైఫల్యాలు వస్తున్న సమయంలో విలన్ వేషాలు వేయడానికి తారక రత్న ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి దగ్గరైన చలపతి రావు కుమారుడు, నటుడు రవిబాబు దర్శకత్వం వహించిన ‘అమరావతి’లో ప్రతినాయకుడిగా నటించారు. ఆ నిర్ణయం ఆయనకు మేలు చేసింది. విలనిజానికి గాను నంది అవార్డు తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ హీరోగా కొన్ని సినిమాలు చేసినా విజయాలు రాలేదు.
నారా రోహిత్ ‘రాజా చెయ్యి వేస్తే’లోనూ తారక రత్న విలనిజం చూపించారు. ఆ సినిమాలో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. ‘దేవినేని’ సినిమాలో దేవినేని నెహ్రూ పాత్ర పోషించారు. థియేటర్లలో విడుదలైన తారకరత్న చివరి సినిమా అంటే ‘ఎస్ 5’ అని చెప్పాలి. గత ఏడాది డిసెంబర్ 31న ఆ సినిమా విడుదలైన సంగతి కూడా చాలా మందికి తెలియదు. అందులో సాయి కుమార్, సునీల్, తారక రత్న నటించారు.