వైసీపీ నేత, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కరలేదు. నిత్యం తన బూతులతో, వివాదాస్పద వ్యాఖ్యలతో బూతుల మంత్రి అని ప్రతిపక్ష నేతలు ముద్దుగా పిలుచుకునే కొడాలి నాని పదే పదే వార్తల్లో నిలుస్తుంటారు. తనకు దివంగత నందమూరి హరికృష్ణ రాజకీయ భిక్ష పెట్టారని చెబుతూ ఉండే నాని…టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లపై మాత్రం విషం చిమ్ముతుంటారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా కొడాలి నానిపై నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి వంశమని, ఆ విషయం నాని గుర్తు పెట్టుకోవాలని రామకృష్ణ సూచించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చంద్రబాబు పదేపదే మోసం చేస్తున్నారన్న నాని వ్యాఖ్యలపై రామకృష్ణ ఘాటుగా స్పందించారు. ఎవరు ఎవరిని మోసం చేశారో తన ఆత్మసాక్షిని కొడాలి నాని అడగాలని హితవు పలికారు.
టీడీపీని కొడాలి నాని వాడుకున్నారని, నందమూరి కుటుంబాన్ని మోసం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై కూడా రామకృష్ణ స్పందించారు. వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. చివరకు అడుక్కోవడానికి కూడా చిప్ప దొరకని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్రానికి పునర్వైభవం తీసుకురావడం చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. నిమ్మకూరులో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.