నవ్యాంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతి అంటూ అమరావతి టు అరసవెల్లి పేరుతో రైతులు మహా పాదయాత్ర 2.0 చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకు ప్రభుత్వం, పోలీసుల మద్దతు లేకపోయినప్పటికీ కోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్న రైతులు అదే అకుంఠిత దీక్షతో నిర్విఘ్నంగా మహా పాదయాత్ర 2.0ను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పాదయాత్రకు టీడీపీ సహా విపక్ష పార్టీల నేతలందరూ మద్దతు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పాదయాత్రకు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మహానేత నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ మద్దతుపలికారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో కొనసాగుతున్న పాదయాత్రలో రామకృష్ణ పాల్గొన్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెనుగొండ, కవటం, మార్టేరు మీదుగా దాదాపు మూడు గంటల పాటు పాదయాత్రలో ఆయన నడిచి రైతులలో ఉత్సాహం నింపారు.
ఈ పాదయాత్రపై వైసీపీ నేతలు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. అమరావతి కోసం 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులను హేళన చేస్తూ మాట్లాడడం సరికాదని ఆయన మండిపడ్డారు. అమరావతి కోసం వైసీపీ నేతలు ఒక సెంటు కూడా ఇవ్వలేదని, అలా ఇచ్చి ఉంటే భూమి విలువ ఏంటో వారికి తెలిసేదని రామకృష్ణ అన్నారు. ప్రపంచంలో మూడు రాజధానులు విజయవంతమైన దాఖలాలు ఎక్కడా లేవని అన్నారు.
మండల వ్యవస్థ ద్వారానే నిజమైన పాలన వికేంద్రీకరణ అని అన్నగారు ఏనాడో చాటిచెప్పారని రామకృష్ణ గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో హోండా, ఇసుజు, అశోక్ లేలాండ్, పలు ఐటీ కంపెనీలు, మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు, 11 జాతీయ విశ్వవిద్యాలయాలు వచ్చాయని, ఇలా రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అవి ఏర్పాటు చేసి చంద్రబాబు పాలనను వికేంద్రీకరించారని గుర్తు చేశారు.