వైసీపీ నేత, పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని గురించి తెలుగు ప్రజలకు పరిచయం అక్కర లేదు. తాను మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అని కూడా మరచిపోయి…కొడాలి నాని చెప్పే బూతు పంచాంగం గురించి అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు సహజం…కానీ, నాని మాత్రం వ్యక్తిగత దూషణలు, బూతులతో వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ నాయకులంటేనే జనానికి ఏవగింపు కలిగేలా చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, దేవినేని ఉమలపై నాని తరచుగా అసభ్యకర పదజాలంతో మీడియా సమావేశాల్లో వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, నాని స్థాయికి తాము దిగజారి మాట్లాడలేమని, తమకు టీడీపీ నేర్పిన క్రమశిక్షణ అటువంటిదని టీడీపీ నేతలు అంటుంటారు. ఇటీవల మీడియా సమావేశంలోనూ లోకేష్, చంద్రబాబులనుద్దేశించి బూతుల మంత్రి నాని…నోటికొచ్చినట్టు మాట్లాడారు.
ఈ నేపథ్యంలో బూతుల మంత్రి నానికి నందమూరి వారసుడు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. కొడాలి నానిపై నటుడు, వ్యాపార వేత్త నందమూరి చైతన్య కృష్ణ తీవ్రస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ లపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తానంటూ కొడాలి నానికి చైతన్య వార్నింగ్ ఇచ్చారు. బూతుల మంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
మంత్రిగా ఉన్నపుడు లోకేష్ యువతకు ఎన్నో ఉద్యోగాలు కల్పించారని, 12 వేల కిలోమీటర్ల రహదారిని రాష్ట్రవ్యాప్తంగా వేయించారని కొనియాడారు. లోకేష్ ను, చంద్రబాబును విమర్శించే అర్హత కొడాలి నానికి లేదని చైతన్య అన్నారు. చంద్రబాబు, లోకేష్ లపై ఒక అవినీతి కేసు కూడా లేదని, రౌడీయిజం గూండాయిజం నారావారి ఇంటా వంటా లేవని అన్నారు. పేకాట క్లబ్బులు నిర్వహించే చరిత్ర కొడాలి నానిదని, జగన్ ప్రోత్సహంతోనే నాని బూతుల మంత్రిగా మారారని విమర్శించారు.