1974 ఆగష్టు 30న ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన `తాతమ్మకల` సినిమాతో తెరంగేట్రం చేసిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఇటీవలె నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నెల రోజుల ముందు నుంచే తెలుగు చలన చిత్ర పరిశ్రమ సన్నాహాలు చేస్తోంది. ఫైనల్ గా సెలబ్రేషన్స్ టైమ్ రానే వచ్చింది.
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నోవోటెల్ లో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత గ్రాండ్ గా జరగబోతున్నాయి. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి స్పెషల్ గెస్ట్లుగా హాజరుకాబోతున్నారు.
అలాగే బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో సందడి చేయబోయే ముఖ్య అతిథుల లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్ సేతుపతి, కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యాచో హీరో గోపిచంద్, అల్లు అర్జున్, అఖిల్ అక్కినేని, విజయ్ దేవరకొండ, సాయి దుర్గ తేజ్, నాగ శౌర్య, సిద్దు జోన్నలగడ్డ, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, శివ కార్తికేయన్ తదితరుల హీరోల పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరుకానున్నారని తెలుస్తోంది. అయితే ఎవరెవరికో ఇన్విటేషన్స్ అందాయి.. కానీ సొంత ఫ్యామిలీలోని జూ. ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ లను మాత్రం బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఆహ్వానించలేదని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే నిజమైతే నందమూరి ఫ్యాన్స్ రెండుగా చీలడం ఖాయమవుతుంది.