ఏపీ సీఎం జగన్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని జగన్‌కు హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా ఏపీలో ఏం జరిగిందనే విషయంపై నెటిజన్లు ఆరాతీస్తున్నారు. 2014లో హుజూర్‌నగర్‌లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న అభియోగంపై ఈ మేరకు సమన్లు జారీ చేసింది. 2014 హుజూర్నగర్ ఎన్నికల్లో కోడ్ ఉల్లఘించారని ఆయనపై కేసు నమోదయ్యింది.
అయితే ఈ కేసు విషయమై సోమవారం నాడు కోర్టుకు హాజరుకావాలని జగన్‌కు సమన్లు జారీ చేసింది. ఈ సమన్ల గురించి ఇంతవరకూ ప్రభుత్వం కానీ.. వైసీపీ నేతలు కానీ ఎవరూ రియాక్టవ్వలేదు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే.. ఈ కేసు 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదైంది. ఈ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి వైసీపీ తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టింది. అయితే.. ఎన్నికల నియమావళిని పాటించలేదు.
అంతేకాదు.. కాంపిటెంట్ అథారిటీ అనుమతి లేకుండానే రోడ్ షో నిర్వహించడంతో అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు.. జగన్‌తో పాటు ఆ పార్టీ సభ్యులైన జి నాగిరెడ్డి, జి శ్రీకాంత్‌పై కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్-188, 143 కింద అప్పట్లోనే పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. అయితే 2014 నాటి ఈ కేసులో ఎమ్మెల్యే, ఎంపీ కేసుల ప్రత్యేక సెషన్స్ కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.
కాగా.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులకు సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారని తెలుస్తోంది. ఈ సమన్లకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇదే నాంపల్లి కోర్టుకే పలుమార్లు ఇద్దరూ హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. మరి ఆయన హాజరు అవుతారా? లేక.. న్యాయవాదిని పంపించి సరిపెడతారా? అనేది చూడాలి.