ఒకప్పటి స్టార్ హీరోయిన్ నమిత కు తాజాగా ఓ గుడిలో ఘోర అవమానం జరిగింది. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నమిత.. మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లగా, అక్కడి సిబ్బంది ఆమెను దేవాలయంలోకి అనుమతించలేదట. హిందువు అని నిరూపించే సర్టిఫికెట్స్ చూపించాలంటూ ఆలయ సిబ్బంది నమితను డిమాండ్ చేశారట.
తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని నమిత్ర సోషల్ మీడియాలో ద్వారా పంచుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. `కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఫ్యామిలీతో కలిసి మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లాము. కానీ అక్కడి సిబ్బంది ఆలయంలోకి వెళ్లకుండా నన్ను అడ్డుకున్నారు. తనను, తన కుటుంబ సభ్యులను హిందూ కుల ధ్రువీకరణ పత్రం చూపించాలన్నారు.
వారి మాటలు నన్నెంతో బాధపెట్టాయి. తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను తాను సందర్శించినట్లు చెప్పినా వినిపించుకోలేదు. చాలా దురుసుగా ప్రవర్తించారు. నా పట్ల, నా కుటుంబం పట్ల అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను` అంటూ ఓ వీడియో ద్వారా నమిత చెప్పుకొచ్చింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో.. నమిత అభిమానులు సదరు ఆలయ సిబ్బందిపై దుమ్మెత్తిపోస్తున్నారు.
దీంతో ఆలయ అధికారులు నమిత వీడియోపై స్పందించారు. నమితతో ఎవరూ అమర్యాదగా ప్రవర్తించలేదని.. ఆలయం రూల్స్ ప్రకారమే మాట్లాడమని తెలిపారు.పై అధికారులు చెప్పడంతో కొంతసేపు ఆగమని చెప్పామని.. ఆ తర్వాత ఆలయంలోకి అనుమతించామని వివరణ ఇచ్చారు. కాగా, మోడల్ గా కెరీర్ స్టార్ ఆ తర్వాత హీరోయిన్ గా మారిన నమిత.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హోదాను సంపాదించుకుంది. 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లాడి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 2022లో ఈ దంపతులు ట్విన్ బాయ్స్ కు జన్మనిచ్చారు.