విశాఖ గర్జనపై, మంత్రి ధర్మాన ప్రసాద్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు. తాము, తమ బినామీలు, తమ కుటుంబాలు కొట్టేసిన భూములు, ఆస్తుల్ని కాపాడుకోవడానికే ధర్మాన ప్రసాదరావు, ఉత్తరాంధ్ర మంత్రులు విశాఖ గర్జన పెట్టారని ఎద్దేవా చేశారు. ఆ ప్రాంత వాసుల్ని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు రెచ్చగొడుతూ, జగన్ రెడ్డి మూడుముక్కలాటకు వంతపాడుతున్నారని, ఉత్తరాంధ్రపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారని సెటైర్లు వేశారు.
సీబీఐ ఛార్జ్ షీట్లలో ఒక దానిలో జగన్ ఏ1 అని, ధర్మాన ప్రసాదరావు ఏ5 అని, అటువంటి ధర్మాన ప్రసాదరావు పెద్ద నీతిమంతుడిలా ఇప్పుడు మాట్లాడుతున్నాడని విమర్శించారు. 67 కంపెనీలకు అధిపతిగా ఉన్న జగన్ ముఖ్యమంత్రి కావాలంటున్నాడని, అలాంటి వ్యాపారధోరణితో ఉన్న వ్యక్తి ప్రజలకు సేవచేస్తాడా అని గతంలో ధర్మాన అన్న వ్యాఖ్యలను నక్కా ఆనంద బాబు గుర్తు చేశారు. తండ్రి పదవిని అడ్డంపెట్టుకొని జగన్ రెడ్డి సీఎం కావాలని తాపత్రయపడుతున్నాడంటూ ధర్మాన ప్రసాదరావు గతంలో చేసిన కామెంట్లను నక్కా ఆనందబాబు ప్రస్తావించారు.
ఇక, మాజీ సైనికోద్యోగుల భూములను ధర్మాన ప్రసాదరావు దిగమింగారని పరోక్షంగా సిట్ కూడా నివేదిక ఇచ్చిన వైనాన్ని కూడా నక్కా ఆనందబాబు గుర్తు చేశారు. ఆ వ్యవహారాలు కప్పిపుచ్చుకోవడానికే ధర్మాన విశాఖను రాజధాని అంటున్నారని ఎద్దేవా చేశారు. పలువురు ఐఏఎస్ లు, సబ్ రిజిస్ట్రార్ల పాత్ర కూడా ఆ కుంభకోణంలో ఉందని సిట్ తేల్చిందని గుర్తు చేశారు. మరిన్ని భూములను జగన్ అండతో కొట్టేయడానికే ధర్మాన తన నరంలేని నాలుకకు పనిచెప్పి, ఉత్తరాంధ్రవాసుల మనస్సుల్లో విషబీజాలు నాటుతున్నాడని దుయ్యబట్టారు.తన తల్లిని ఆ నగరప్రజలు ఓడించారన్న కక్షతోనే వారిపై పెత్తనం చేయడానికి సాయిరెడ్డిని, వైవీ సుబ్బారెడ్డిని అక్కడ నియమించాడని, వారిద్దరూ దోచిపెడితే తరువాత తీరుబడిగా జగన్ వెళ్లి అక్కడ తిష్టవేస్తాడని ఎద్దేవా చేశారు.